Begin typing your search above and press return to search.

మానవ ఆయుష్సు 150 ఏండ్లు.. పుతిన్‌, జిన్‌పింగ్‌ కొత్త ఫార్మూలా సిద్ధం..

బయోటెక్నాలజీ, అవయవ మార్పిడి రంగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి వల్ల మానవ జీవితాన్ని పొడిగించడం ఇక కల కాదు అని పుతిన్‌ అనువాదకుడు ముందుగా వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   4 Sept 2025 1:22 PM IST
మానవ ఆయుష్సు 150 ఏండ్లు.. పుతిన్‌, జిన్‌పింగ్‌ కొత్త ఫార్మూలా సిద్ధం..
X

బీజింగ్‌లో జరిగిన సైనిక పరేడ్ సందర్భంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అంశం ఆయుధ ప్రదర్శన కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన ప్రత్యేక సంభాషణ. ఈ ఇద్దరు శక్తివంతమైన నేతలు “మానవ జీవితం 150 ఏళ్ల వరకు పొడిగించగలమా?” అన్న ప్రశ్న చుట్టూ మాట్లాడుకోవడం అంతర్జాతీయ వేదికలన్నింట్లో ఆసక్తి రేపుతోంది.

బయోటెక్నాలజీ – భవిష్యత్తు ఆశలు

బయోటెక్నాలజీ, అవయవ మార్పిడి రంగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి వల్ల మానవ జీవితాన్ని పొడిగించడం ఇక కల కాదు అని పుతిన్‌ అనువాదకుడు ముందుగా వ్యాఖ్యానించారు. పుతిన్ మాటల్లో, “శరీరానికి కొత్త అవయవాలు అందించగలిగితే, మనుషులు వయస్సు పెరిగినా కొత్త ఉత్సాహం పొందుతారు. దీర్ఘాయుష్షు చివరికి అమరత్వానికి దారితీస్తుంది” అన్న భావన వ్యక్తమైంది. దీనికి ప్రతిస్పందనగా జిన్‌పింగ్‌ ప్రస్తావిస్తూ, “ఈ శతాబ్దంలోనే ప్రజలు 150 ఏళ్ల వరకు జీవించే అవకాశముందని శాస్త్రీయ అంచనాలు చెబుతున్నాయి” అన్నారు.

మనుషులు ఎంత కాలం జీవించగలరు?

ఈ చర్చ లైవ్‌ స్ట్రీమ్‌లో ప్రసారమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు ఆసక్తిగా గమనించారు. ఒక దశలో వారితో పాటు ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా కనిపించగా, ఆయన ఆ సంభాషణలో భాగమయ్యారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కెమెరా ఫ్రేమ్ మారిపోవడంతో పుతిన్ వ్యాఖ్యలలో కొంత భాగం మాత్రమే వినిపించాయి. అయినప్పటికీ, “మనుషులు ఎంత కాలం జీవించగలరు?” అన్న ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

సాంకేతిక ప్రగతి...

ఇటీవల అవయవ మార్పిడి, స్టెమ్‌ సెల్‌ పరిశోధన, కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య సాంకేతికతలు వేగంగా ఎదుగుతున్నాయి. ఈ పరిణామాలు మానవ జీవితాన్ని పొడిగించే దిశగా పునాదులు వేస్తున్నాయి. శతాబ్దం క్రితం సగటు జీవనపరిమితి 40-50 ఏళ్లే. నేడు వైద్యసాంకేతికతతో 80-90 ఏళ్ల వరకు సజీవంగా ఉండడం సాధారణమైంది. ఈ నేపథ్యంలో 150 ఏళ్లు అనడం అసాధ్యం కాదు అనే వాదన ముందుకు వస్తోంది.

భవిష్యత్ పై నమ్మకం

పుతిన్‌, జిన్‌పింగ్ మధ్య చోటుచేసుకున్న ఈ సంభాషణ కేవలం శాస్త్రీయ అంచనాల గురించే కాదు; మానవ ఆశయాలు, భవిష్యత్‌ టెక్నాలజీపై ఉన్న నమ్మకం గురించీ చెప్పింది. జీవితం 150 ఏళ్ల వరకు పొడిగితే సమాజం, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ బంధాలపై ఏమి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ, దీర్ఘాయుష్షు సాధన మనసులోని కలలకే కాదు, శాస్త్రప్రగతితో సాధ్యమయ్యే లక్ష్యంగానూ మారుతోంది.