Begin typing your search above and press return to search.

ట్రంప్ బాధపడుతాడని మీటింగ్ మధ్యలో వెళ్లిపోయిన పుతిన్

ఈ ఫోన్‌కాల్ గురించి పుతిన్ సహాయకుడు యూరీ ఉష్కోవ్ స్పందిస్తూ, ఇద్దరు నాయకుల మధ్య చర్చ సూటిగా జరిగిందని చెప్పారు.

By:  Tupaki Desk   |   4 July 2025 8:00 PM IST
ట్రంప్ బాధపడుతాడని మీటింగ్ మధ్యలో వెళ్లిపోయిన పుతిన్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా మరోసారి అతనితో ఫోన్‌కాల్ మాట్లాడేందుకు సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం సంచలనంగా మారింది. "ట్రంప్ వేచిచూడకుండా.. ఆయన బాధపడకూడదని" చెప్పి వేదిక వదిలి వెళ్లిపోయిన పుతిన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆయన చూపిన గౌరవానికి విరుద్ధంగా చర్చ ముగిసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్‌పై మరోసారి భారీ దాడులకు రష్యా దిగడం హాట్ టాపిక్ గా మారింది.

- మధ్యలోనే సమావేశం వదిలిన పుతిన్!

గతంలో గూఢచార్య సంస్థ కేజీబీ అధికారిగా పనిచేసిన అనుభవంతో రాజకీయంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరున్న పుతిన్‌, ఇటీవల మాస్కోలో ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనీషియేటివ్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ట్రంప్‌తో ఫోన్‌కాల్ షెడ్యూల్ కావడంతో సమావేశం నడుస్తుండగానే వేదికపై నుంచి లేచి వెళ్లిపోయారు. "మీరెవ్వరూ కోప్పడకండి.. కానీ ట్రంప్‌ను వేచి పెట్టడం సరిగ్గా కాదు. ఆయన బాధపడవచ్చు," అని మైకులోనే చెప్పి వెళ్లిపోయారు.

-ఫోన్‌కాల్ ఎఫెక్ట్ లేదు: ట్రంప్ అసంతృప్తి

పుతిన్‌తో ట్రంప్ జరిపిన ఫోన్‌కాల్‌ ఉదయం 10 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ప్రారంభమై, సుమారు గంటపాటు సాగింది. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ పరిస్థితులు తదితర అంశాలపై చర్చ జరిగినా, ఎలాంటి స్పష్టమైన ఫలితం రాలేదని ట్రంప్‌ స్వయంగా చెప్పారు. "మేము చాలా సుదీర్ఘంగా మాట్లాడాం. కానీ పురోగతి లేదు. నేను సంతృప్తిగా లేను," అని మీడియాతో చెప్పాడు.

-రష్యా గట్టిగానే ఉంది: క్రెమ్లిన్ ప్రకటన

ఈ ఫోన్‌కాల్ గురించి పుతిన్ సహాయకుడు యూరీ ఉష్కోవ్ స్పందిస్తూ, ఇద్దరు నాయకుల మధ్య చర్చ సూటిగా జరిగిందని చెప్పారు. ట్రంప్ వెంటనే కాల్పులు నిలిపేయమని కోరినా పుతిన్ తిరస్కరించారని తెలిపారు. యుద్ధానికి గల మౌలిక కారణాలు తొలగించకపోతే, రష్యా తాను తీసుకున్న లక్ష్యాల్ని చేరుకునే వరకూ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, దౌత్యపూరితంగా పరిష్కారానికి తాము సిద్ధమేనని పేర్కొన్నారు.

చర్చల ముగింపు తరువాత వెంటనే దాడులు!

అమెరికా అధ్యక్షుడితో సంభాషించిన కొద్దిసేపటికే, మాస్కో సైన్యం ఉక్రెయిన్‌పై మరిన్ని క్షిపణి దాడులకు దిగింది. కీవ్ సహా 13 ప్రదేశాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, కింజాల్ హైపర్‌సోనిక్ మిసైళ్లు ప్రయోగించి భారీ నాశనం కలిగించింది. ఉక్రెయిన్ వాయుసేన ప్రకారం ఈ దాడిలో 14 మంది గాయపడ్డారు. రెండు విడతల్లో ఈ దాడులు జరిగాయి.

ఈ ఘటనలన్నింటి మధ్య పుతిన్ ట్రంప్‌కి ఇచ్చిన గౌరవం, అదే సమయంలో ఉక్రెయిన్‌పై చూపిన కఠినత్వం.. రష్యా యుద్ధ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టంగా చూపిస్తోంది. చర్చల వేదికపై సమయం కేటాయించినా, మారేలా కనిపించని పుతిన్‌ దూకుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.