Begin typing your search above and press return to search.

ట్రంప్ ని పైకెత్తుతున్న పుతిన్... ఏమిటీ సంగతి?

అమెరికా - రష్యా... ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Jun 2025 2:29 PM IST
ట్రంప్  ని పైకెత్తుతున్న పుతిన్... ఏమిటీ సంగతి?
X

అమెరికా - రష్యా... ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎప్పటికైనా తన మిత్రదేశాల సహాయ సహకారాలతో కలిసి అమెరికాకు షాకివ్వాలని రష్యా భావిస్తుంటుందని అంటారు. ఈ క్రమంలోనే చైనా, ఉత్తరకొరియా, రష్యా ఒక బ్యాచ్ గా మారినట్లు చెబుతారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ను పుతిన్ పొగడ్తలతో ముంచెత్తడం ఆసక్తిగా మారింది.

అవును... తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన రష్యా అధక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతూ.. అందుకు ట్రంప్ కి థాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇందులో భాగంగా.. ఆయన చాలా ధైర్యవంతుడని, రెండుసార్లు హత్యా ప్రయత్నాల నుంచి బయటపడ్డారని అన్నారు.

ఇదే సమయంలో... ట్రంప్ పట్ల తనకు గొప్ప గౌరవం ఉందని.. అమెరికా అధ్యక్షుడిని కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా నాయకుడు అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన ట్రంప్... పుతిన్ కొన్ని మంచి వ్యాఖ్యలు చేశారని అన్నారు. దీంతో... రష్యా, అమెరికా మధ్య సంబంధంలో సానుకూల మార్పు కనిపిస్తుందని.. రెండు ప్రపంచ శక్తుల మధ్య సంబంధాలు స్థిరపడటం ప్రారంభించాయనే చర్చ మొదలైంది.

ఇటీవల కాలంలో ట్రంప్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉక్రెయిన్‌ తో యుద్ధాన్ని ముగించడానికి రష్యా నిరాకరించిన సంగతి తెలిసిందే! దీంతో... పుతిన్ తో ట్రంప్ విభేదిస్తున్నారని అంటారు. ఈ క్రమంలోనే.. ఒకానొకసమయంలో... పుతిన్ ని పూర్తిగా పిచ్చివాడు అని కూడా ట్రంప్ సంభోదించారు. అయితే... ప్రస్తుతం పుతిన్ ఆలోచన మారిందని అంటున్నారు. ఉక్రెయిన్ తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

అమెరికా నేతృత్వంలోని దౌత్య ప్రయత్నం ఫలితంగా రష్యా – ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండు రౌండ్ల ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగినప్పటికీ.. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, చర్చలు ఎటువంటి పురోగతిని సాధించలేదు. వివాదాన్ని ముగించే నిబంధనలపై ఇరు దేశాలు ఒక క్లారిటీకి రావడం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పుతిన్... ఉక్రెయిన్‌ తో కొత్త రౌండ్ శాంతి చర్చలలో పాల్గొనడానికి మాస్కో సిద్ధంగా ఉందని.. ఆ చర్చలు బహుశా ఇస్తాంబుల్‌ లో జరిగే అవకాశం ఉందని.. అయితే సమయం, వేదిక ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని తెలిపారు. గతంలో చర్చల సమయంలో మార్పిడి చేసుకున్న ప్రతిపాదనలలో గణనీయమైన తేడాలను అంగీకరిస్తూ.. కొత్త చర్చలు ఆ గ్యాప్ ను ఫిల్ చేస్తాయనే ఆశాభావం పుతిన్ వ్యక్తం చేశారు.