భారత్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ?
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తమ పాత సోవియట్ దేశాల్లో మాత్రమే పర్యటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
By: Tupaki Desk | 6 Dec 2025 12:00 AM ISTఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తమ పాత సోవియట్ దేశాల్లో మాత్రమే పర్యటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉత్తర కొరియా, చైనాలకూ పుతిన్ వెళ్లారు. అయితే, ఇవి రెండూ అమెరికాకు ప్రత్యర్థులు. ఇప్పుడు భారత్ లో అడుగుపెట్టారు. అమెరికాతో మూడు దశాబ్దాలుగా స్నేహ సంబంధాలను పెంచుకుంటున్న భారత్ లో.. అదీ ఈ సమయంలో పుతిన్ పర్యటన అంటే ఒకవిధంగా ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనమే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు అయితే కంట్లో నలుసే. ఎందుకంటే తన రెండో విడత అధికారంలో ఎడాపెడా సుంకాలతో విరుచుకుపడి భారత్ నూ వదల్లేదు ట్రంప్. సరే.. పుతిన్ వచ్చారు.. వెళ్లిపోతారు..! మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా భారత్ లో పర్యటిస్తారా? అసలు ఆయన మన దేశం విషయంలో ఎలాంటి వైఖరితో ఉన్నారు? దాదాపు ఏడాదిన్నర కిందట భారత ప్రధాని మోదీ స్వయంగా జెలెన్ స్కీని తమ దేశానికి రమ్మని ఆహ్వానించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు కూడా. ఈ ఏడాది ఆగస్టులోనూ జెలెన్ స్కీ భారత టూర్ పై కథనాలు వచ్చాయి. కానీ, ఇంతవరకు అది జరగలేదు. ఇంతలోనే పుతిన్ టూర్ జరిగింది. మరి జెలెన్ స్కీ ఎప్పుడు భారత్ కు వస్తారు?
మోదీపై మండిపాటు..
వరుసగా మూడోసారి భారత ప్రధాని అయ్యాక మోదీ చేపట్టిన తొలి విదేశీ టూర్ ఏమిటో తెలుసా? రష్యాకు వెళ్లడం. 2024 జూలైలో ఆయన రష్యాలో పర్యటించారు. పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు. దీంతో జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. దానిని మృత్యు కౌగిలి అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ సమయంలో ఉక్రెయిన్ పై రష్యా భారీగా దాడులు చేస్తుండడంతో జెలెన్ స్కీ విమర్శలకు ప్రాధాన్యం దక్కింది. అంతర్జాతీయంగానూ భారత్ కు కాస్తంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. శాంతిని కాంక్షించే దేశంగా ఉన్న పేరుకు ఇది పెద్ద డ్యామేజీగా మారే ప్రమాదం తలెత్తింది.
నష్ట నివారణకు ఉక్రెయిన్ కు..
పుతిన్ తో ఆలింగనం..జెలెన్ స్కీ స్పందనతో మోదీ సర్కారు నష్ట నివారణకు దిగింది. యుద్ధంలో ఉన్నప్పటికీ.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌లో పర్యటించారు. పోలండ్ నుంచి ప్రత్యేక రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగానూ నిలిచారు. జెలెన్ స్కీతో చర్చలు జరిపారు. యుద్ధంలో తమది ఎవరి పక్షమూ కాదని శాంతిపక్షం అని ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని చల్లబరిచారు. అంతేకాదు.. జెలెన్ స్కీని భారత్ కు రావాల్సిందిగానూ ఆహ్వానించారు. దీనికి ఒప్పుకొన్నటికీ జెలెన్ స్కీ మాత్రం భారత్ కు రాలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఈ ఆగస్టులో ఆయన పర్యటనపై కథనాలు వచ్చాయి. అవేమీ అమలు కాలేదు. మరి ఆయన ఎప్పుడు వస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
