Begin typing your search above and press return to search.

వీధి కుక్కల్లా యువకులను ఈడ్చుకెళ్తున్నారు.. ఉక్రెయిన్ సైన్యంపై పుతిన్ ఫైర్

బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పుత్నిక్ న్యూస్ సంస్థ రిపోర్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   15 May 2025 3:00 AM IST
వీధి కుక్కల్లా యువకులను ఈడ్చుకెళ్తున్నారు.. ఉక్రెయిన్ సైన్యంపై పుతిన్ ఫైర్
X

ఉక్రెయిన్ సైన్యంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ఆరోపణలు చేశారు. యువకులను వీధి కుక్కల్లా ఈడ్చుకెళ్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు జరగబోతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సైన్యంపై మాటల దాడికి దిగారు. ఉక్రెయిన్ ప్రభుత్వం యువకులను వీధుల్లో కుక్కలను పట్టుకున్నట్టుగా బలవంతంగా సైన్యంలోకి లాక్కెళ్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పుత్నిక్ న్యూస్ సంస్థ రిపోర్ట్ చేసింది. అయితే, రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోందని పుతిన్ చెప్పారు. తమ సైన్యం ఎవరినీ భయపెట్టదని, స్వచ్ఛందంగా వచ్చిన వారినే చేర్చుకుంటుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లోని యువతకు సైన్యంలో చేరాలనే ఉత్సాహం ఏమాత్రం లేదని, కానీ రష్యన్లు మాత్రం సైన్యంపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేందుకే పుతిన్ ఇలా మాట్లాడారని ఆ వార్తా సంస్థ పేర్కొంది.

"కీవ్‌లో ఉన్న అధికారులు సైనిక సమీకరణ పేరుతో యువకులను వీధుల్లో కుక్కల్లా పట్టుకుని ఈడ్చుకెళ్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 వేల మందిని ఇలా తీసుకెళ్లారు. కానీ మా దగ్గర అలా కాదు. ఇక్కడ యువకులు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాదాపు 60 వేల మంది సైన్యంలో చేరేందుకు ముందుకొచ్చారు" అని పుతిన్ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌తో సంక్షోభం మొదలైనప్పటి నుంచి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు దేశం విడిచి వెళ్లకూడదని రష్యా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, 27 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా సైన్యంలో చేరాలని నిబంధనలు పెట్టింది. గతేడాది రష్యా సైన్యంలో భారీగా సైనికులు మరణించడంతో ఆ దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మరోవైపు, ఉక్రెయిన్ నిర్బంధ సైనిక సమీకరణ వయస్సును 25 ఏళ్లకు తగ్గించింది.

ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌లో సైనిక నియామకాలు పెద్ద వివాదంగా మారుతున్నాయి. సైన్యంలో చేరడానికి ఇష్టపడని యువకులను పోలీసులు వెంటాడటం, వారిని బలవంతంగా బస్సుల్లో ఎక్కించుకుని తీసుకెళ్లడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ బలవంతపు నియామకాలను "బసిఫికేషన్" అని పిలుస్తున్నారు. రిక్రూట్‌లను బస్సుల్లో తరలిస్తుండటంతో ఈ పేరు వచ్చింది. పుతిన్ చేసిన ఈ ఆరోపణలు రానున్న శాంతి చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.