Begin typing your search above and press return to search.

పాతికేళ్ళుగా పుతిన్ పాలనలో రష్యా...

పాలకులు మారిపోతుంటారు...ఒక్కొక్కరి పాలన ఒకలా ఉంటుంది. కానీ కొందరు నేతల్ని మాత్రం ప్రజలు ఎప్పుడూ తమ పాలకులుగానే ఉండిపోవాలని కోరుకుంటారు.

By:  Tupaki Desk   |   5 Dec 2025 4:15 PM IST
పాతికేళ్ళుగా పుతిన్ పాలనలో రష్యా...
X

పాలకులు మారిపోతుంటారు...ఒక్కొక్కరి పాలన ఒకలా ఉంటుంది. కానీ కొందరు నేతల్ని మాత్రం ప్రజలు ఎప్పుడూ తమ పాలకులుగానే ఉండిపోవాలని కోరుకుంటారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఏకంగా పాతికేళ్ళుగా ఏకధాటిగా పాలిస్తున్నారు. విశేషమేంటంటే...గత పదిహేనేళ్ళుగా నరేంద్ర మోదీ భారత్ ప్రధానిగా సేవలందిస్తున్నారు....అతణ్ని స్నేహపూర్వకంగా కలవడానికి వచ్చిన పుతిన్ అంతకు మించి పాతికేళ్ళుగా రష్యా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా వారి పాతికేళ్ళ పాలన విషయం సోషల్ మీడియాతోపాటు ప్రధాన వార్తా స్రవంతిలో తెగ వైరల్ అవుతోంది. ఇదే సందర్భంలో మోదీ వరసగా హ్యాట్రిక్ సాధించి మూడోసారి దేశ ప్రధాని అయిన విషయం వార్తలకెక్కుతోంది.

1999లో అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్ పదవికి రాజీనామా చేశారు. బోరిస్ రాజీనామా వార్త రష్యాలో సంచలనం అయ్యింది. బోరిస్ ఎల్లప్పుడు తను పదవీ కాలం పూర్తయ్యేదాకా ఉంటానని అనేవారు. కానీ కారణాంతరాల వల్ల రాజీనామా చేశారు. ఆ సమయంలో రష్యన్ రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రిగా ఉన్న పుతిన్ తాత్కాలిక అధ్యక్షులు అయ్యారు. సరిగ్గా మూడునెలలు తర్వాత పుతిన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. పుతిన్ అధ్యక్షుడిగా అడుగుమోపిన వేళావిశేషం ఏంటో గానీ ఏకంగా పాతికేళ్ళపాటు అధ్యక్షుడిగా పగ్గాలు పట్టి రష్యాను నడిపిస్తున్నారు. క్రెమ్లిన్ నుంచి బోరిస్ బయలు దేరుతూ పుతిన్ తో రష్యాను జాగ్రత్తగా చూసుకోండి అని సూచించారు. ఆ మాటను పాటిస్తూనే పుతిన్ రష్యాను భద్రంగానే కాకుండా పటిష్టంగా చూసుకుంటున్నారు.

గత పాతికేళ్లుగా పుతిన్ రష్యా ప్రధానిగా, అధ్యక్షుడిగా కొనసాగుతుంటే అగ్రరాజ్యం అమెరికాలో వరసగా అయిదుగురు అధ్యక్షులు మారారు. భారత్ లో ముగ్గురు ప్రధానులు మారారు. రష్యాలో జనాభాలో చాలా మంది అధ్యక్షుడిగా పుతిన్ పేరు తప్ప మరో పేరు తెలియనివారున్నారు. 1952 అక్టోబర్ 7న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ఏడు సంవత్సరాల అనంతరం లెనిన్ గ్రాడ్ లో పుతిన్ జన్మించారు. పుతిన్ తన ఇద్దరు సోదరులను కలుసుకోనే లేదు. ఒకరు విక్టర్ ...లెనిన్ గ్రాడ్ ముట్టడి సమయంలో ఆకలితో మరణించగా, మరొకరు యుద్దానికి ముందే బాల్యంలోనే మరణించారు.

పుతిన్ చిన్ననాటి నుంచి చాలా కఠినమైన వాతావరణంలో పెరిగారు. చిన్ననాటి స్నేహితులు పుతిన్ సన్నగా బలహీనంగా ఉండేవారని అంటారు. తనను ఎవరైనా వేధిస్తే పుతిన్ అస్సలు ఊరుకునే వారు కాదు. 1975లో రష్యా గూఢచార సంస్థ కేజీబీలో చేరారు. 1985లో తూర్పు జర్మనీలో గూఢచారిగా పనిచేశారు. 1991 లో రాజకీయాల్లోకి వచ్చిన పుతిన్ సెయింట్ పీటర్స్ బర్గ్ డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. 1998లో పుతిన్ ను రష్యా సెక్యూరిటీ సర్వీస్ అధిపతిగా బోరిస్ నియమించారు. ఆ తర్వాతి సంవత్సరం ప్రధాన మంత్రిని తొలగించి...పుతిన్ ను ఆస్థానానికి ఎంపిక చేశారు బోరిస్.

వరసగా రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ రష్యా రాజ్యాంగం ప్రకారం మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం లేనందున ప్రధాని అయ్యారు. ఆ సమయంలోనే అధ్యక్ష పదవి ఆరేళ్ళకు పెంచుతూ రాజ్యాంగాన్ని సవరించారు. 2024 లో అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ 2030 దాకా పదవిలో కొనసాగుతారు.