Begin typing your search above and press return to search.

జీ-20 సదస్సు అంటే... ఏమిటీ ప్రయోజనం?

ఇదే సమయంలో భారతదేశం నిర్వహించే అతిపెద్ద దౌత్య కార్యక్రమాలలో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఈ సమయంలో ఈ సదస్సు ఉద్దేశ్యం, ప్రపంచానికి జరిగే ప్రయోజనం వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం...!

By:  Tupaki Desk   |   7 Sep 2023 1:51 PM GMT
జీ-20 సదస్సు అంటే... ఏమిటీ  ప్రయోజనం?
X

సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఇండియా వేదికగా అంతర్జాతీయ జీ-20 సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సదస్సుపైనే ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. ఇదే సమయంలో భారతదేశం నిర్వహించే అతిపెద్ద దౌత్య కార్యక్రమాలలో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఈ సమయంలో ఈ సదస్సు ఉద్దేశ్యం, ప్రపంచానికి జరిగే ప్రయోజనం వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం...!

జీ-20 సదస్సు వేదికగా ఆయా దేశాలు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ గతిని మారుస్తాయని చెబుతుంటారు. ఈ సదస్సులో ముందుగా సభ్య దేశాలు అంతకు ముందు అంగీకరించిన ప్రాధాన్య అంశాలపై నిబద్ధతను చాటుకుంటూ ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తాయి. ఈ ఉమ్మడి ప్రకటనను డిక్లరేషన్ ని పిలుస్తారు.

ఐతే ఈసారి ఢిల్లీ సదస్సులో విడుదల చేసే ఉమ్మడి ప్రకటనను "ఢిల్లీ డిక్లరేషన్" గా పిలుస్తారు. ఇది అత్యంత కీలక ప్రకటన. ఈ సదస్సు రెండో రోజైన ఈనెల 10 న ఈ డిక్లరేషన్ ని ఆమోదించడంతో సదస్సు ముగుస్తుంది. 20 దేశాల మధ్య అంతర్జాతీయ ఆర్ధిక సహకారానికి ఈ సదస్సు ప్రధాన వేదికగా నిలుస్తోంది.

అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం గురించి చర్చించడంలో భాగంగా... అందులో అత్యంత కీలకమైన పారిశ్రామిక అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చడం ఈ కూటమి వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. దీని కోసం జీ20 దేశాల సభ్యులు ప్రతి సంవత్సరం సమావేశమై పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించి విధివిధానాలు రూపొందించుకుంటారు.

ఇక జీ20గా పిలుస్తున్న ఈ గ్రూపులో ప్రస్తుతం 19 దేశాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌతఫ్రికా, టర్కీ, యూకే, యూఎ, యూరోపియన్ యూనియన్‌ లు శాస్వత సభ్య దేశాలుగా ఉండగా... స్పెయిన్ దేశం శాశ్వత అతిథిగా ఆహ్వానించబడింది.

కాగా... 1994 మెక్సికన్ పెసో సంక్షోభం, 1999 ఆసియా ఆర్థిక సంక్షోభం అనంతరం జీ20 ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ జీ20 కూటమికి శాశ్వత నాయకుడు అంటూ ఉండరు. ప్రతీ సంవత్సరం ఒక్కో దేశం ఫోరం అధ్యక్ష పదవిని చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భారతదేశాన్ని ఎంపిక చేయగా... 2022లో ఇండోనేషియా ఈ బాధ్యతలు చూసింది.

ఇదే క్రమంలో జీ-20 అధ్యక్ష స్ధానంలో ఉన్న దేశం జీ20 ఎజెండాను నడిపిస్తూ సదస్సు నిర్వహిస్తుంది. దీనికోసం మరో రెండు దేశాలు మద్దతు ఇస్తుంటాయి. వీటిలో ఒకటి గత సంవత్సరం అధ్యక్ష పదవిని కలిగి ఉన్న దేశం కాగా.. మరొక దేశం వచ్చే ఏడాది అధ్యక్ష పదవిని చేపట్టే దేశం అయ్యి ఉంటుంది. ఈ ఏర్పాటును "ట్రోయికా" అంటారు.

ఇందులో భాగంగా గతేడాది జీ20 సదస్సు జరిగిన ఇండోనేషియాతో పాటు వచ్చే ఏడాది ఈ సదస్సుకు వేదిక కానున్న బ్రెజిల్ లు ఈ ఢిల్లీలో జరిగే సదస్సులో ఇండియాతో కలిసి "ట్రోయికా" గ్రూప్ గా ఉంటాయి.

ఇక ఈ సదస్సులో జీ-20 ఎజెండా పని మూడు విభిన్న ట్రాక్‌ ల ద్వారా నిర్వహిస్తారు. ఇందులో షెర్పా ట్రాక్, ఫైనాన్స్ ట్రాక్, ఎంగేజ్మెంట్ గ్రూపులు ఉంటాయి. వీటిలో షెర్పా ట్రాక్‌ కు సభ్య దేశాల దూతలు నాయకత్వం వహిస్తారు. ఇది ఎక్కువగా వ్యవసాయం, అవినీతి వ్యతిరేకత, అభివృద్ధి, సంస్కృతి, విద్య, వాణిజ్యం, ఆరోగ్యం, పర్యాటకం, డిజిటల్ ఎకానమీ మొదలైన ఆర్థికేతర చర్చలకు సంబంధించినది.

ఇక రెండో గ్రూప్ అయిన ఫైనాన్స్ ట్రాక్‌ కు సభ్యదేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు నాయకత్వం వహిస్తారు. వీరంతా కలిసి అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్, ఫైనాన్స్ & హెల్త్ వంటి అంశాలపై చర్చిస్తారు.

ఇక ఎంగేజ్మెంట్ గ్రూప్‌ కు విషయానికొస్తే... దీనికి విధాన రూపకల్పనలో సహకరించే ప్రభుత్వేతర వ్యక్తులు, జీ-20 నేతలు నాయకత్వం వహిస్తారు. ఇది జీ20 సదస్సుకు దోహదపడే పౌర సంఘాలు, యువత, మహిళలు, కార్మికులు మొదలైన వారితో కలిసి పని చేస్తుంది.

ఇంత కీలకమైన ఈ సదస్సు ఈ ఏడాది ఇండియా వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో జరగనుంది.