పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి
పూరీ శ్రీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద తలెత్తిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు
By: Tupaki Desk | 29 Jun 2025 12:01 PM ISTపూరీ శ్రీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద తలెత్తిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు జరిగిన ఈ దుర్ఘటన యాత్రలో పాల్గొన్న వేలాది మంది భక్తుల్లో కలకలం రేపింది.
పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం జగన్నాథ రథయాత్ర అనంతరం రథాలు గుండిచా ఆలయం సమీపంలోని శారద బలి వద్దకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 4:20 గంటల సమయంలో రథాలపై ఉన్న జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రమ్మ దేవతల దర్శనార్థం వేలాది మంది భక్తులు ఒకేసారి ముందుకు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనలో ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42) అనే ముగ్గురు మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడగా, వారిలో 12 మందిని కటక్‌లోని ప్రత్యేక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గాయపడినవారికి పూరీలో ప్రాథమిక వైద్యం అందించి కొందరిని డిశ్చార్జ్ చేశారు.
ప్రభుత్వ స్పందన
ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. భద్రతా లోపాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
భారీగా భక్తుల రాక
పూరీ రథయాత్రకు శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. అధిక ఉష్ణోగ్రతలు, జన సమూహం, మౌలిక వసతుల లోపం వంటి సమస్యలు భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. దాదాపు 750 మంది భక్తులు అలసట, డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురవ్వడంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
భద్రతా బలగాలు తక్షణమే స్పందించి గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించగా, పరిస్థితిని సమర్థంగా నియంత్రించాయి. రథయాత్రకు ముందస్తు ఏర్పాట్లలో ఉన్న లోపాలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
