ఇసకేస్తే.. రాలదు: పూరీ జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం!
ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు.
By: Garuda Media | 16 July 2026 3:14 PM ISTఒడిశాలోని పూరీలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. ‘జై జగన్నాథ్’ నినాదాలతో పూరీ వీధులు మార్మోగుతున్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిలను రథాలపై వేంచేపు చేసి.. గుండిచా ఆలయం వరకు రథయాత్రను నిర్వహించనున్నారు. ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి, గుండిచా ఆలయంలోని తన అత్తవారింటికి వెళ్లే జగన్నాథుడి రథయాత్రకు ఎంతో విశేషం ఉంది.
మూడు రథాలను ముందుకు లాగేందుకు విశేష సంఖ్యలో భక్తులు పోటీ పడతారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 13 వేల మందికి పైగా పోలీసులను భద్రతా విధులకు కేటాయించారు. 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 473 సీసీటీవీ కెమెరాలు, 65 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ రథయాత్ర ఈ నెల 24వ తేదీ వరకు జరగనుంది. ఈ యాత్రలో సుమారు 5 నుంచి 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.
పూరీ జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో జగన్నాథుని సైకత శిల్పాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా 3 పెద్ద రథాలతో పాటు 100 చిన్నపాటి రథాలను కూడా ఇసుకతో చూడముచ్చటగా రూపొందించారు. పర్యాటకులు ఈ సైకత శిల్పాలను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. కొందరు తమ సెల్ ఫోన్‌లలో చిత్రాలు, వీడియోలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ.. భగవంతుడి దగ్గరకు భక్తులు వెళ్లడం సహజమేనని, కానీ, రథయాత్ర రూపంలో భగవంతుడే భక్తుల వద్దకు వస్తాడని.. ప్రపంచంలో ఇంత పెద్ద రథయాత కేవలం పూరీలోనే జరగడం విశేషమని పేర్కొన్నారు. కాగా.. రథయాత్రను ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. తొలి రథాన్ని ఆయనతో పాటు ముఖ్యమంత్రి ముందుకు లాగడంతో యాత్ర ఘనంగా ప్రారంభం కావడం విశేషం.
