Begin typing your search above and press return to search.

పురంధేశ్వరికి టఫ్ గానే నట ?

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి పార్లమెంట్ ని వదిలేది పదేళ్ళు అవుతోంది.

By:  Tupaki Desk   |   12 April 2024 8:41 AM GMT
పురంధేశ్వరికి టఫ్ గానే నట ?
X

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి పార్లమెంట్ ని వదిలేది పదేళ్ళు అవుతోంది. అధికారంలో లేకుండా కూడా అంతే సమయం అయింది. 2014లో ఆమె కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ బీజేపీలో చేరారు. బీజేపీ ఆమెకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తుందని తలచారు. కానీ అలా జరగలేదు. 2014లో రాజంపేట సీటు పొత్తులో ఇచ్చారు.

టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఆనాడు బాగానే వర్కౌట్ అయింది కానీ రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ ఫేవరేట్ రీజియన్. అక్కడ పోటీ చేయడంతో పురంధేశ్వరి ఓటమి పాలు అయ్యారు. 2019 నాటికి చూస్తే పొత్తులు లేవు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అపుడు విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన చిన్నమ్మకు అంతా రివర్స్ అయింది. డిపాజిట్లు కూడా బీజేపీకి గల్లంతు అయ్యాయి.

ఇక 2024 ఎన్నికలు ఆమెకు కీలకం. ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా ఇవి ఆమెకు చివరి ఎన్నికలే అని అంటున్నారు. ఈసారి గెలిస్తే దగ్గుబాటి హితైష్ ని తన రాజకీయ వారసుడిగా తయారు చేసి తాను సక్సెస్ ఫుల్ గా పాలిటిక్స్ నుంచి రిటైర్ కావాలని ఆమె చూస్తున్నారు. ఈసారి పొత్తులు ఉపకరించి ఆమె గెలిస్తే కేంద్రంలో ఎటూ మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి కేంద్ర మంత్రిగా ఆమెకు పక్కాగా చాన్స్ ఉంటుంది.

దాంతో దగ్గుబాటి ఆడపడుచు రాజకీయం వేరే లెవెల్ లో ఉంటుంది. ఓడితే మాత్రం ఈసారితోనే సరి అన్నట్లుగా ఉంటుంది అంటున్నారు. నిజం చెప్పాలంటే ఆమె విశాఖ ఎంపీ సీటు కోరుకున్నారు అని అంటారు. టీడీపీ పొత్తుతో విశాఖ సీటు ఇచ్చి ఉంటే చూసుకోకుండా పురంధేశ్వరి గెలిచేవారు అన్నది ఒక అభిప్రాయంగా ఉంది. కానీ ఆమెకు రాజమండ్రి సీటు ఇచ్చారు.

దాంతో అక్కడ టఫ్ గానే ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజమండ్రి పరిధిలో చూస్తే బీజేపీకి పెద్దగా బలం అయితే లేదు. 1998లో ఈ సీటులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలుచుకుంది. అలాగే పొత్తులతో 1999లో మరోసారి గెలిచింది. ఇది జరిగి పాతికేళ్ళు అయింది. ఆనాటి నుంచి చూస్తే మళ్లీ పొత్తులతో బీజేపీ పోటీకి దిగడం ఇదే ప్రధమం.

ఇక పొత్తులు సవ్యంగా సాగితే ఈ సీటు టీడీపీ కూటమికే దక్కుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధికి లక్షా యాభై వేల పై చిలుకు ఓట్లు లభించాయి. ఈసారి ఆ సంఖ్య మరింతగా పెరగవచ్చు. పైగా ఆనాడు వైసీపీకి వచ్చిన మెజారిటీ లక్షా 21 వేలు మాత్రమే.

అయితే బీజేపీకి అనపర్తి సీటు ఇవ్వడంతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అలాగే జనసేనకు రెండు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. వీటిలో టీడీపీ ఆశావహులలో అసంతృప్తి బాగా ఉంది. దాంతో పాటుగా మూడు పార్టీల మధ్య కో ఆర్డినేషన్ ఇప్పటికైతే సవ్యంగా లేదు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే 2014 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన బొడ్డు వెంకట రమణ చౌదరికి ఎంపీ టికెట్ ఇచ్చిన వైసీపీ 2019 నుంచి తన రూట్ మార్చింది. బీసీ కార్డుని నమ్ముకుంది. అలా మార్గాని భరత్ ని గెలిపించుకుంది. ఈసారి కూడా బీసీకే టికెట్ ఇచ్చింది. డాక్టర్ గూడూరు శ్రీనివాసులు ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.

విద్యాధికుడు అయిన బీసీ ప్రముఖుడిగా డాక్టర్ గా ఆయనకు పేరు ఉంది. దాంతో బీసీ సామాజిక వర్గాలు ఆ వైపుగా మళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇక బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు కూడా ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతాయని అంటున్నారు. సీనియర్ నేత సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వకపోవడం ప్రభావం చూపించే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఈ మొత్తం విశ్లేషణను చూసుకుంటే మాత్రం పురంధేశ్వరికి రాజమండ్రి సీటు టఫ్ గానే ఉందని అంటున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు చేయించిన సర్వేలలో ఇదే విషయం వచ్చిందని అంటున్నారు. రానున్న రోజులలో మరింత పదునైన వ్యూహాలతో కూటమి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.