Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి...చిన్నమ్మ ఏమన్నారంటే ?

తెలుగు సినీ సీమను ఏలుతున్న టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉన్నారు ఆయన పాన్ ఇండియా రేంజిలో సత్తా చాటుతున్నారు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 9:51 PM IST
జూనియర్ ఎన్టీఆర్  రాజకీయాల్లోకి...చిన్నమ్మ ఏమన్నారంటే ?
X

తెలుగు సినీ సీమను ఏలుతున్న టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉన్నారు ఆయన పాన్ ఇండియా రేంజిలో సత్తా చాటుతున్నారు. ట్రిపుల్ ఆర్ హిట్ తో ఖండాంతరాలకు ఆయన కీర్తి పాకింది దాంతో పాన్ వరల్డ్ హీరోగా కూడా మారిపోయారు. ఇక ఎన్టీఆర్ చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆయన ఫ్యూచర్ ఘనంగా ఉంది.

ఆయన ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదనే ఉంచారు. అయితే జూనియర్ ఇంత క్లియర్ గా ఉన్నా ఆయన పాలిటిక్స్ లోనికి వస్తారని ప్రచారం మరో వైపు సాగుతోంది. ఇటీవల కర్నూల్ లో ఒక సమావేశానికి వచ్చిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. అలా జూనియర్ కి పాలిటిక్స్ కి మిక్స్ చేస్తూ మాట్లాడేవారు ఎక్కువగానే ఉన్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా ఉన కేంద్ర మాజీ మంత్రి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ని ఒక యూట్యూబ్ చానల్ తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. జూనియర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని యాంకర్ వేసిన ప్రశ్నకు ఆయన సొంత మేనత్త కూడా అయిన పురందేశ్వరి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

జూనియర్ ఇంకా వయసులో చిన్న వారు. ఆయనకు సినీ రంగంలో ఎంతో భవిష్యత్తు ఉంది అని అన్నారు. ఆయన మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో తమకు తెలియదు అన్నారు. ఆయన ఆలోచించుకోవాల్సి ఉందని అన్నారు. ఆయన తన నిర్ణయం మేరకు రావాలి అనుకుంటే వస్తారు. కానీ ఇపుడు చిన్న వయసు దృష్ట్యా తొందరపడి రాజకీయాల్లోకి రావాలా అన్నది ఆయనే ఆలోచించుకోగలరని అన్నారు. దానికి తాను జవాబు చెప్పలేనని అన్నారు. అంతే కాదు జూనియర్ ని చిన్నపుడు అంతా కలసి దూరం పెట్టారు అన్న దాని మీద కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. అదంతా ఇపుడు అప్రస్తుతం అన్నారు. అది చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. ఇపుడు మాత్రం అంతా కలసి ఉంటున్నామని ఆమె చెప్పడం విశేషం.

ఇక తన కుమారుడు హితైష్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నది కూడా ఆయన సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. హితైష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాము అడ్డు చెప్పమని అలాగని తమ ఆలోచనలు ఆయన మీద రుద్దమని పురందేశ్వరి స్పష్టం చేశారు ప్రస్తుతం ఆయన తన వ్యాపారాలలో బిజీగా ఉన్నారని ఫ్యూచర్ లో ఏమి జరగవచ్చు అన్నది చూడాలని అన్నారు.

అలాగే తన భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి విరమించుకోవడం ఆయన సొంత నిర్ణయం అన్నారు. ఆయన 2014లోనే రాజకీయ విరమణ నిర్ణయం తీసుకున్నారని అయితే తన కోసమే ఆయన కొంతకాలం కొనసాగారు అన్నారు. ప్రస్తుతం ఆయన తన రిటైర్మెంట్ లైఫ్ ని బాగా లీడ్ చేస్తున్నారు అన్నారు.

మరో వైపు చూస్తే తన మావయ్య దగ్గుబాటి చెంచురామయ్య విషయం కూడా ఆమె ప్రస్తావిస్తూ కారంచేడు గొడవలలో ఆయనను అనవసరంగా టార్గెట్ చేశారు అని అన్నారు. ఆయన పెద్ద మనిషిగా ఉండేవారు అన్నారు ఊరి కోసం మేలు చేసే మనిషిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. అలాంటిది ఆయనను హత్య చేయడం ఆ రోజులలో బాధించింది అని ఆమె అన్నారు.

మొత్తం మీద చూస్తే జూనియర్ తో మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పిన ఆమె ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేదు. తమ మధ్య ఆ రకమైన చర్చ ఎపుడూ జరగదని అన్నారు. అంతే కాదు ఎవరి ఆలోచనలు వారిని అన్నట్లుగా జూనియర్ కే వదిలిపెట్టేసారు. అయితే జూనియర్ మాత్రం సినిమాల మీదనే ఫోకస్ ఉంచారు. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి ఎప్పటికీ రారు అన్నది ఎవరూ చెప్పలేకపోయినా ఇపుడు అయితే రారు అన్నది మాత్రం స్పష్టంగా చెప్పగలరని అంటున్నారు.