బీజేపీ మిషన్ సౌత్.. పురందేశ్వరి త్వరలో ప్రమోషన్!
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దశ తిరగనుందని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 10 April 2025 10:00 PM ISTఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ప్రమోషన్ రానుందా? బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ కూటమితో పొత్తు ఏర్పడటంలో కీలకంగా వ్యవహరించిన పురందేశ్వరికి సముచిత గౌరవం ఇవ్వాలని కమలం పెద్దలు భావిస్తున్నారా? మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న పురందేశ్వరికి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే పురందేశ్వరి విషయంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం రెండు పోస్టులు పరిశీలిస్తున్నారని, ఆ రెండింట్లో ఏదో ఒకటి పురందేశ్వరికి కేటాయించవచ్చునని అంటున్నారు. వచ్చేవారమే ఇందుకు ముహూర్తమంటూ కమలం పార్టీ వర్గాల సమాచారం.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దశ తిరగనుందని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పురందేశ్వరిని పార్టీ లక్కీ హ్యాండ్ గా ప్రధాని మోదీ భావిస్తున్నారంటున్నారు. ఏపీలో కూటమి ఏర్పడటంతోపాటు తాను మూడోసారి పీఎంగా బాధ్యతలు తీసుకోడానికి ఏపీ ఎంపీల బలమే ప్రధానం కావడంతో పురందేశ్వరికి సముచిత స్థానం కల్పించాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో పార్టీ బలం రెండింతలు అవ్వాలంటే పురందేశ్వరి వంటి మహిళా నాయకులను ప్రోత్సహించాలని ప్రధాని భావిస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో అత్తెసరు సీట్లు రావడం, ప్రభుత్వం కొనసాగాలంటే మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సిన రావడాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ సొంతంగా గెలిచేలా బలం పుంజుకోవాలని ప్రధాని మోదీ బీజేపీ నేతలకు సూచిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అంటున్నారు.
ప్రస్తుతం దక్షిణ భారత్ లో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం దక్కింది. కేరళ, తమిళనాడుల్లో బీజేపీ ఖాతాయే తెరవలేని పరిస్థితి. అదేవిధంగా కర్ణాటకలో గతంలో కంటే సగం సీట్లు తగ్గిపోవడంపై హైకమాండులో ఆందోళన రేపుతోంది. ఇక ఏపీలో ఎంత ప్రయత్నించినా సొంతంగా బలం పుంజుకునే పరిస్థితి లేక మిత్రపక్షాల ఓట్లపై ఆధారపడాల్సివస్తోంది. అంతో ఇంతో తెలంగాణలో బీజేపీకి కాస్త చాయిస్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసిందని అంటున్నారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణ భారతీయులకు కేటాయించాలని కమలం పెద్దలు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇందుకోసం పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు. తెలుగువారైన సీనియర్ నేతలు మురళీధరన్, రాంమాధవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారిని పార్టీ జాతీయ అధ్యక్షులను చేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే పురందేశ్వరి పేరును పరిశీలించవచ్చనని అంటున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోవడంతో పురందేశ్వరికి జాతీయ అధ్యక్ష పదవి దక్కేచాన్స్ లేదన్న వాదన వినిపిస్తోంది. కాగా, బీజేపీ రూల్స్ ప్రకారం పురందేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలను రెండోసారి కట్టబెట్టే చాన్సు ఉన్నప్పటికీ, అధిష్టానం మాత్రం ఆమె సేవలను కేంద్రంలో వాడుకోవాలని చూస్తుందని అంటున్నారు.
దీంతో పురందేశ్వరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే చాన్సు కనిపిస్తోందని అంటున్నారు. మిత్రపక్షాలకు ఈ పదవిని ఇవ్వాలని భావించినా, పార్టీకి దక్షిణాదిలో బలపడటం అత్యావసరం కావడంతో పురందేశ్వరితో ఆ పోస్టును భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. సీనియర్ ఎంపీగా ఉండటమే కాకుండా హిందీ, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే సత్తా కూడా ఉండటం పురందేశ్వరికి అడ్వాంటేజ్ అంటున్నారు. అంతేకాకుండా పార్లమెంటరీ వ్యవహారాలపైనా ఆమెకు అనుభవం ఉండటంతో డిప్యూటీ స్పీకర్ పదవికి పురందేశ్వరి తగిన వ్యక్తిగా బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో వచ్చేవారమే ఆమెకు పట్టాభిషేకం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
