చిన్నమ్మను ఊరిస్తున్న మూడు పదవులు! ఏదో ఒకటి ఫిక్స్
ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్రంలో కీలక పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 17 July 2025 3:00 AM ISTఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్రంలో కీలక పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఆమె పేరును మూడు పదవుల కోసం పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఆ మూడు పదవుల్లో ఏదో ఒకటి కచ్చితంగా పురందేశ్వరికి కేటాయిస్తారని కమలం నేతలు భావిస్తున్నారు. పురందేశ్వరి కుటుంబ నేపథ్యంతోపాటు ఆమె సామర్థ్యం, పాలన దక్షతా, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటున్న కేంద్రం అన్ని చూసుకుని సముచితమైన పదవి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటికి మూడు సార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన పురందేశ్వరి గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదిరేలా కీలకంగా పనిచేశారని అంటున్నారు. ఆమె వ్యూహాలతోనే గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి రికార్డు స్థాయి విజయాలు దక్కించకున్నట్లు బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో కేంద్ర మంత్రిగా, బీజేపీ మహిళా మోర్చా నేతగా పనిచేసిన పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగిస్తే దక్షినాదిలో పార్టీ బలం పుంజుకుంటుందని ఊహిస్తున్నారు.
ఉత్తరాదిలో హవా చాటుకుంటున్న బీజేపీకి దక్షిణాదిలో మాత్రం పలు రాష్ట్రాలు కొరకరాని కొయ్యగా కనిపిస్తున్నాయని అంటున్నారు. దీంతో పార్టీని దక్షిణాదిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న బీజేపీ జాతీయ నేతలు ఈ ప్రాంతానికి చెందిన నేతలను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ దిశగానే పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని అంటున్నారు. సాధారణంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారికే ఎక్కువగా కేటాయిస్తారు. కానీ, పురందేశ్వరి విషయంలో ఆ సూత్రానికి మినహాయింపు ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో విజయం దక్కిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పురందేశ్వరి పేరును జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ దఫా పార్టీ అధ్యక్ష పదవిని దక్షిణాదికి కేటాయించడంతోపాటు మహిళా నేతను ఎంపీక చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం దాదాపు నిర్ణయించిందని అంటున్నారు. దీంతో పురందేశ్వరి పేరు ప్రముఖంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. పురందేశ్వరితోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే నిర్మలా సీతారామన్ ను మంత్రి వర్గం నుంచి తప్పించి పార్టీ పదవికి తీసుకోవడం కన్నా, మంచి వాగ్దాటి ఉన్న పురందేశ్వరిని ఎంపిక చేయడమే బెటర్ అన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోందని అంటున్నారు. అయితే పురందేశ్వరి పేరును ఆర్ఎస్ఎస్ నాయకత్వం వ్యతిరేకిస్తే ప్రత్యామ్నాయంగా చిన్నమ్మకు కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన కూడా ఉందంటున్నారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి పూర్తవడంతో త్వరలో మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి లేదంటే కేంద్ర మంత్రిగా పురందేశ్వరిని తీసుకోవడం ఖాయమంటున్నారు. ఇక ఇదే సమయంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి పురందేశ్వరి పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి లోక్ సభ ఎన్నికల అనంతరం పురందేశ్వరిని స్పీకర్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అప్పట్లో స్పీకర్ ను మార్చకుండా ఓం బిర్లాకు రెండోసారి కొనసాగింపు నిచ్చారు. ఈ పరిస్థితుల్లో 2019 నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని పురందేశ్వరితో భర్తీ చేస్తారని అంటున్నారు. ఏదైనా సరే త్వరలో చిన్నమ్మకు మంచి పదవి దక్కనుందని బీజేపీ వర్గాల సమాచారం.
