చిన్నమ్మకు మంత్రి యోగం లేనట్టే!
తర్వాత.. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా రాజంపేట నుంచి పోటీ చేశారు. అప్పుడుకూడా పురందేశ్వరికి పరాజయం తప్పలేదు.
By: Tupaki Desk | 23 April 2025 4:00 PM ISTఏపీ బీజేపీ సారథి, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మకు కేంద్ర మంత్రి యోగం లేనట్టేనా? ఆమె పెట్టుకున్న ఆశలు ఇక తీరనట్టేనా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నాయకులు. గతంలో 2009-14 పురందేశ్వరి కేంద్రంలోని కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం లో పురందేశ్వరి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వరుస పరాజయాలను చవి చూశారు. 2014లో విశాఖ పట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత.. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా రాజంపేట నుంచి పోటీ చేశారు. అప్పుడుకూడా పురందేశ్వరికి పరాజయం తప్పలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం దశాబ్ద కాలం తర్వాత.. విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యానికి తోడు కారణాలు ఏవైనా రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ, జనసేనలతో కలిసేందుకు, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. నారా లోకేష్ను తీసుకుని కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపినప్పుడు కూడా.. పురందేశ్వరి కీలక పాత్ర పోషించారన్న చర్చ ఉంది. దీంతో ఆమె కేంద్రంలో బలమైన ప్రాధాన్యం కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత మూడు నెలల కాలంలో నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన ఆమె.. కేంద్ర మంత్రివర్గంలో సీటు కోసం.. శత విధాల ప్రయత్నించారన్న వాదన ఉంది. అయితే.. ఎప్పటికప్పుడు.. ఈ విషయంపై దాట వేత ధోరణి కనిపించింది. ఇక, తాజాగా.. పురందేశ్వరికి ప్రమోషన్ ఇస్తూ.. కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు మహిళా సభ్యులతో కూడిన ``పార్లమెంటు మహిళా సాధికార కమిటీ` చైర్ పర్సన్‌గా పురందేశ్వరిని నియమించారు.
వాస్తవానికి ఈ కమిటీ నియామకం పార్లమెంటు పరిధిలోనే జరిగినా.. కేంద్ర ప్రబుత్వ సిఫారసులు పనిచేశాయి. ఈ కమిటీ చైర్ పర్సన్‌కు కేబినెట్ కు తక్కువగా సహాయ మంత్రి స్థాయి ప్రొటోకాల్ అమలవుతుంది. ఇక, ఈ కమిటీలో హేమమాలిని, తెలంగాణకుచెందిన డీకే అరుణ, కడియంకావ్య కూడా ఉన్నారు. మొత్తానికి ఈ పదవిని ఇవ్వడం ద్వారా.. పురందేశ్వరికి కేంద్ర మంత్రి వర్గంలో గేట్లు మూసుకుపోయినట్టేనని అంటున్నారు బీజేపీ నాయకులు.
