Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరికలకు పురంధేశ్వరి బ్రేకులు... ?

ఏపీ బీజేపీలో చేరికలను ఏకంగా అడ్డుకుంటున్నది రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి అని ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 9:11 AM GMT
బీజేపీలో చేరికలకు పురంధేశ్వరి బ్రేకులు... ?
X

ఎన్నికల సీజన్ అంటే అటు వారు ఇటు వస్తారు. ఇటు నుంచి అటు వెళ్తారు. ఏపీలో అన్ని పార్టీలలో చేరికలు ఉంటున్నాయి. జనసేనలోకి కూడా కొందరు నేతలు వెళ్ళి చేరారు. ఆఖరుకు కాంగ్రెస్ లోనూ చేరికలు కొంత ఉన్నాయి. మరి జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారం గత పదేళ్లుగా చేస్తూ వస్తున్న బీజేపీ మరోసారి అధికారం అందుకుంటామని ధీమాగా ఉన్న బీజేపీ లో చేరికలు ఎందుకు లేవు అన్న చర్చ సాగుతోంది.

ఏపీ బీజేపీలో చేరికలను ఏకంగా అడ్డుకుంటున్నది రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి అని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఆడియో లీకులు కూడా బీజేపీ పెద్దల వద్దకు చేరాయని అంటున్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాల్సిన నేపధ్యంలో తామై కోరి వచ్చిన నేతలను కూడా టీడీపీ వైపుగా మళ్ళించే ప్రయత్నం పురంధేశ్వరి చేశారు అని ప్రచారం సాగుతోంది.

ఇటీవల ఒంగోలు, నెల్లూరులకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు బీజేపీలోకి చేరాలని ప్రయత్నం చేసారుట. వారు తమకున్న పరిచయాలతో కేంద్ర బీజేపీ పెద్దల వద్దకు వెళ్తే ఏపీ నాయకత్వాన్ని సంప్రదించమని సూచించారుట. అలా పురంధేశ్వరి వద్దకు వెళ్ళిన వారికి బీజేపీలో కండువాలు వేసి చేర్చుకోకపోగా ఏపీ బీజేపీలో ఏముంది ఎత్తిగిల్లే పరిస్థితి లేదు టీడీపీలో చేరమని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన కూడా బీజేపీలో చేరికలు వద్దు అనే అమూల్యమైన సూచనలు ఇస్తున్నారుట. మొత్తానికి ఈ వ్యవహారం కాస్తా బీజేపీ కేంద్ర పెద్దలకు చేరింది అని అంటున్నారు దాంతో వారు ఏపీ బీజేపీ పెద్దల మీద సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయం పదవులు అన్నీ కాంగ్రెస్ బీజేపీలోనే దక్కాయని అంటున్నారు. ఆమెను రెండు సార్లు ఎంపీగా చేసి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ కి ఆమె గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. బీజేపీలో ఆమెను ఏపీ ప్రెసిడెంట్ గా చేశారు. 2014, 2019లోన్న లోక్ సభ టికెట్లు ఇచ్చారు. అయినా సరే ఏపీ బీజేపీని బలపరచకుండా ఆమె టీడీపీ బలపడేలా చూస్తున్నారు అన్నది పార్టీలోని మరో వర్గం విమర్శలుగా ఉంది.

అయితే ఇంతకాలం ఆమె టీడీపీ పట్ల కొంత సానుభూతితో ఉంటున్నారు అన్న వార్తలే వచ్చాయి కానీ తాజాగా ఇద్దరు ఎంపీల వ్యవహరం తరువాత టీడీపీకి మద్దతుగానే బలంగా ఉంటున్నారు అన్నది కేంద్ర బీజేపీ పెద్దలకు తెలిసింది అని అంటున్నారు. దాంతో ఆమె విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్ గా ఉందని అంటున్నారు.

మరి ఆమెను ఎన్నికల వరకూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తారా లేక ఇపుడే సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది తెలియడం లేదు అంటున్నారు. అంతే కాదు ఆమెకు లోక్ సభ టికెట్ ఇస్తారా లేదా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా బీజేపీలో పురంధేశ్వరి వైఖరి పట్ల పార్టీలో రెండవ వర్గం అయితే గుస్సాగా ఉంది. ఇపుడు కేంద్ర నాయకత్వం కూడా ఆగ్రహంగా ఉందని ప్రచారం చెస్తున్నారు. సంచలన పరిణామాలు ఉంటాయా లేదా అన్నది చూడాలని అంటున్నారు.