Begin typing your search above and press return to search.

మద్యం కొత్త బ్రాండ్లు తెచ్చింది జగన్‌ అనుచరులే: పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 2:09 PM GMT
మద్యం కొత్త బ్రాండ్లు తెచ్చింది జగన్‌ అనుచరులే: పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
X

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతికి కర్త, కర్మ, క్రియ వైసీపీయేనని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఏపీలో దశల వారీ మద్య నిషేధం ఏమైందని పురందేశ్వరి ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పినదానికి.. అధికారంలోకి వచ్చాక, ఆచరిస్తున్న దానికి సంబంధం లేదన్నారు. గతంలో ఉన్న బ్రాండ్లను తీసేసి తమ అనుచరులు తయారు చేస్తున్న మద్యం బ్రాండ్లను జనం నెత్తిన రుద్దుతున్నారని విమర్శించారు. 2019లో మద్యంపై ఉన్న ఆదాయం ఎంత? ఇప్పుడు ఎంత? ఉందని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్‌ లా, ఖురాన్‌ లా, భగవద్గీతలా ఎంతో పవిత్రంగా చూస్తాను అని జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? అని పురందేశ్వరి నిలదీశారు. మద్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి జగన్‌ నాడు ఏం చెప్పారు? నేడు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లను జగన్‌ వచ్చాక మొత్తంగా తీసేశారని గుర్తు చేశారు. కొత్త బ్రాండ్లను మార్కెట్‌ లోకి తెచ్చారని ఆరోపించారు. ఈ బ్రాండ్లను తయారు చేసే వారు ఎవరో కాదు. వారంతా జగన్‌ అనుచరులేనని తీవ్ర విమర్శలు చేశారు.

అధికార పార్టీలో ఉన్న కొందరు ముఖ్య నేతలు.. ఇంతకుముందు ఉన్న మద్యం సంస్థల యాజమాన్యాలను బెదిరించి వారి నుంచి కంపెనీలను లాక్కున్నారని పురందేశ్వరి ఆరోపించారు. పేర్లు మార్చి ఈ కంపెనీలను నడుపుతున్నారని విమర్శించారు.

ఓ మద్యం కంపెనీ యజమాని తన కంపెనీని మీకు ఇవ్వను అని చెప్పినందుకు వాళ్ల కంపెనీ తయారు చేస్తున్న మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని బాంబుపేల్చారు. అంటే ఆ యజమాని ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాడో చూడాలని కోరారు.

2019 సంవత్సరానికి మద్యం మీద రాష్ట్రానికి వస్తున్న ఆదాయం రూ.16 నుంచి రూ.18 వేల కోట్లుగా ఉందన్నారు. కానీ, ఇవాళ రూ.32 వేల కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి వస్తోందన్నారు.

ఒక పక్క కుటుంబాలు కూలిపోయినా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు అన్నట్టు ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని పురందేశ్వరి మండిపడ్డారు. చేయూత ఇవ్వడం కోసం.. తన ఓటు బ్యాంకుని పదిలపరుచుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం సరికాదన్నారు. కుటుంబాలను నాశనం చేయడం అనేది శవాల మీద పేలాలు ఏరుకోవడం కాదా? అని సీఎం జగన్‌ పై పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పురందేశ్వరిని టీడీపీ ఏజెంట్‌ గా వైసీపీ విమర్శిస్తోంది. బీజేపీని రాష్ట్రంలో టీడీపీకి బీటీమ్‌ గా తయారుచేస్తున్నారని ఆరోపిస్తోంది. పురందేశ్వరి బీజేపీలో చంద్రబాబు కోవర్టుగా ఉన్నారని ఇప్పటికే వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.