Begin typing your search above and press return to search.

అధికారంలోకి వచ్చేస్తుందట

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:14 AM GMT
అధికారంలోకి వచ్చేస్తుందట
X

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. అధికారంలోకి వచ్చేస్తున్నామన్న భావనతోనే నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాలన్నీ కలిసి పనిచేయాలని ఆమె చెప్పారు. జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల కార్యవర్గాలతో పురందేశ్వరి సమావేశమయ్యారు. పార్టీలోని నేతలు, క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి రావటం పెద్ద కష్టంకాదన్నారు. అధికారంలోకి వచ్చే విషయంలో పురందేశ్వరి ఎంత నమ్మకంగా ఉన్నారనే విషయం దీంతో అర్ధమవుతోంది.

పార్టీ అధికారంలోకి రావటం దేవుడెరుగు అసలు 175 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి బీజేపీకి గట్టి అభ్యర్ధులు ఉన్నారా అన్నదే సందేహం. నిజానికి ఇది సందేహం కాదు వాస్తవం కూడా. పార్టీ తరపున పోటీచేయటానికి పట్టుమని పది నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు లేరు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తే పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ కూడా దక్కలేదు. పార్టీ మొత్తానికి వచ్చిన ఓట్ల శాతం 0.59. కనీసం 1 శాతం ఓట్లు కూడా లేని పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని అంటే ఎవరైనా నమ్ముతారా ?

పోయిన పార్లమెంటు ఎన్నికలో విశాఖపట్నం ఎంపీగా పోటీచేసిన పురందేశ్వరికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇంతకుమించిన సీన్ ఉంటుందని అనుకునేందుకు లేదు. ఏ సామాజికవర్గం కూడా బీజేపీకి అండగా లేదన్నది వాస్తవం. పైగా నరేంద్రమోడీ ప్రభుత్వం అంటేనే జనాలు మండిపోతున్నారు. విభజన హామీలను తుంగలో తొక్కేయటం ఒక కారణం అయితే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేస్తుండటం రెండో కారణం.

పార్టీ మొత్తంలో బలమైన నేత అని చెప్పుకునేందుకు కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. జనసేనతో పొత్తు కారణంగానే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఓట్లు పడితే పడాలంతే. అంతకుమించి ఆశలు పెట్టుకునేందుకు లేదని బహుశా పురందేశ్వరికి కూడా ఈపాటికి బాగా తెలిసిపోయుండాలి. కానీ పార్టీ పరిస్ధితిని బయటకు చెప్పుకోలేక పార్టీ సమావేశాల్లో మాత్రం అధికారంలోకి వచ్చేస్తున్నామని, వచ్చేయటం ఖాయమని, వచ్చేయాలన్న భావనతో పనిచేయాలని ఏదేదో మాట్లాడేస్తున్నారు.