క్లాస్ రూమ్ హర్రర్... బాలికను చంపి తనను తాను కాల్చుకున్న క్లాస్ మేట్!
అందుకు కారణం... తాజాగా పంజాబ్ లో ఓ విద్యార్థి తన క్లాస్ మేట్ అయిన అమ్మాయిని తుపాకితో కాల్చి, తనను తాను కాల్చుకుని.. క్లాస్ రూమ్ లో హర్రర్ వాతావరణాన్ని సృష్టించాడు!
By: Raja Ch | 9 Feb 2026 6:33 PM ISTసాధారణంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో తుపాకీ సంస్కృతి రోజు రోజుకీ పెరుగుతూ... ఫలితంగా రోడ్లు, పార్కులు, విద్యా సంస్థలు, పార్టీ ఏరియాల్లోనూ తుపాకీ చప్పుళ్లు వినిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా భారతదేశంలోనూ గన్ కల్చర్ పెరుగుతుందా అనే చర్చ తెరపైకి వచ్చింది! అందుకు కారణం... తాజాగా పంజాబ్ లో ఓ విద్యార్థి తన క్లాస్ మేట్ అయిన అమ్మాయిని తుపాకితో కాల్చి, తనను తాను కాల్చుకుని.. క్లాస్ రూమ్ లో హర్రర్ వాతావరణాన్ని సృష్టించాడు!
అవును... భారత్ లోని విద్యాసంస్థల్లోనూ తుపాకీ శబ్ధాలు వినిపిస్తున్నాయి! ఇందులో భాగంగా... తాజాగా పంజాబ్ లోని తర్న్ తరన్ జిల్లాలో ఒక ఫస్ట్ ఇయర్ లా విద్యార్థి.. తన క్లాస్ మేట్ అయిన అమ్మాయిని కాల్చి, అనంతరం అదే తుపాకితో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణించగా.. హాస్పటల్ లో చికిత్స పొందుతున్న నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మొత్తం కెమెరాలో రికార్డైంది!
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం... ఉదయం 9:15 గంటల ప్రాంతంలో జలంధర్ జిల్లాలోని మల్లియన్ విలేజ్ నివాసి అయిన ప్రిన్స్ రాజ్ (20) క్లాస్ రూమ్ లోకి ఎంటరై.. నౌషెహ్రా పన్నువాన్ నివాసి అయిన సందీప్ కౌర్ (19), మరో మహిళా క్లాస్ మేట్ దగ్గరకు వెళ్లి వారితో క్లుప్తంగా మాట్లాడిన తర్వాత ఆ ముగ్గురూ తరగది వెనుక సీట్లలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో.. కొన్ని క్షణాల తర్వాత ప్రిన్స్ రాజ్ అకస్మాత్తుగా లేచి నిలబడి, తన బ్యాగ్ లో ఉన్న తుపాకీ తీసి.. సందీప్ కౌర్ ను నేరుగా కాల్చాడు.
దీంతో ఆమె వెంటనే కుప్పకూలిపోయింది! మరుక్షణమే ప్రిన్స్ రాజ్ తనను తాను కాల్చుకుని బెంచీల మధ్య కుప్పకూలిపోయాడు! ఆ సమయంలో క్లాస్ ముందు రోల్ లలో ఉన్న క్లాస్ మెట్స్ ఆందోళనలతో బయటకు పరుగులు తీశారు! ఉదయం ఇంకా క్లాస్ లు ప్రారంభం కాని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు! ఈ సమయంలో.. సందీప్ కౌర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. ప్రిన్స్ రాజ్ ను చికిత్స నిమిత్తం హాస్పటల్ కి తరలించారు.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. ఈ కాల్పుల వెనుక ఉద్దేశం ఇంకా తెలియలేదని అంటున్నారు. ఈ సందర్భంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఇద్దరి మొబైల్ ఫోన్ లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది!
ఈ సందర్భంగా స్పందించిన బాధితురాలి తల్లి హర్జిందర్ కౌర్... కళాశాల భద్రత, ప్రోటోకాల్ లను ప్రశ్నించారు. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేలా తాను కష్టపడి పని చేస్తున్నానని.. ఈ రోజు రోజూలాగే తన కుమార్తె కాలేజీకి వెళ్లిందని.. కానీ, విగత జీవిగా మిగిలిందని చెబుతూ... అసలు ఓ విద్యార్థి కాలేజీలోకి తుపాకీ ఎలా తీసుకుని వెళ్తాడు, కాలేజీలో భద్రత వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది!
