పంజాబ్ లో రెండు చోట్ల పేలుడు.. తామే చేశామని ధృవీకరించిన ఉగ్రవాద సంస్థ..
శాంతియుతంగా ఉండే పంజాబ్ రాష్ట్రంలో ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల పేలుళ్లు సంభవించడం ఆందోళనకరం.
By: Tupaki Political Desk | 6 May 2026 12:12 PM ISTశాంతియుతంగా ఉండే పంజాబ్ రాష్ట్రంలో ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల పేలుళ్లు సంభవించడం ఆందోళనకరం. సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశ భద్రతా సంస్థలు అప్రమత్తం కావడం సహజం. అమృత్‌సర్ కంటోన్మెంట్, జలంధర్ బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం వంటి అత్యంత రక్షణాత్మకంగా ఉండే ప్రాంతాల సమీపంలో ఈ ఘటనలు జరగడం భయాందోళనలు కలిగిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో మంగళవారం (మే 05, 2026) రోజున ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమృత్‌సర్, జలంధర్‌లో జరిగిన పేలుళ్ల ధాటికి ప్రజలు భీతిల్లారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం ఈ ఉదంతాన్ని మరింత సీరియస్‌గా మార్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
అమృత్‌సర్, జలంధర్ లో ఏమైంది..?
రాష్ట్రంలో అమృత్ సర్, జలంధర్ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఉపశమనమే అయినా భద్రతా పరమైన చర్చ కొనసాగుతోంది. ఖాసా కంటోన్మెంట్ ప్రాంతం సమీపంలో పేలుడు శబ్దం వినిపించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పేలుడు ధాటిని పరీశీలించారు. సేకరించిన నమూనాలను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయం వెలుపల రాత్రి 8 గంటల సమయంలో ఒక స్కూటర్ పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు సమీపంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో కొరియర్ బాయ్ గుర్ప్రీత్ సింగ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
దర్యాప్తు కోణాలు
ఈ పేలుళ్ల వెనుక ఉగ్రవాద కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (KLA) జలంధర్ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. పోలీసులు ఈ ప్రకటనను ధృవీకరిస్తున్నారు. ఈ ఘటనలో పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టి హస్తం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఫోరెన్సిక్ బృందాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు రెండు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
రాజకీయ దుమారం..
ఈ ఘటనలతో పంజాబ్‌లో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. అధికారులు ఎటువంటి విచారణ లేకుండా తొందరపాటు నిర్ణయాలకు రావద్దని సూచించారు. భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా లేదని, ప్రజల్లో విశ్వాసాన్ని నింపే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం, పేలుళ్ల ప్రయత్నాలు పెరుగుతున్న తరుణంలో పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయడం ముఖ్యం. ఏప్రిల్ 27న పటియాలాలో జరిగిన పేలుడు ప్రయత్నం తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా లోపాలను ఎత్తి చూపుతోంది. ఫోరెన్సిక్ నివేదికలు వస్తే తప్ప ఇవి ప్రమాదవశాత్తూ జరిగినవా లేదంటే పక్కా స్కెచ్‌తో చేసిన దాడులా అన్నది తేలదు.
