పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా: వైరల్ వీడియోతో మరోసారి బయటపడ్డ నిజస్వరూపం!
పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదాన్ని అరికడుతున్నామని ఎంతగా గొంతు చించుకున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి.
By: A.N.Kumar | 23 May 2026 3:28 PM ISTపాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదాన్ని అరికడుతున్నామని ఎంతగా గొంతు చించుకున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మారిందనే ఆరోపణలు కొత్తవి కావు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో ఈ ఆరోపణలను వంద శాతం నిజం చేస్తూ పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది. 2019లో జరిగిన ఘోరమైన పుల్వామా ఉగ్రదాడి సూత్రధారిగా భారత భద్రతా సంస్థలు గుర్తించిన హమ్జా బుర్హాన్ అంత్యక్రియల దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఒకే వేదికపై మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు
ఇటీవల పాకిస్తాన్‌లో హతమైన హమ్జా బుర్హాన్ అంత్యక్రియల వీడియోలో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ముద్రపడిన వారు బహిరంగంగా ప్రత్యక్షమవడం గమనార్హం. ముఖ్యంగా భారత్‌లో ఎన్నో విధ్వంసాలకు కారణమైన హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, అల్–బదర్ ఉగ్రవాద సంస్థ అధినేత భక్త్ జమీన్ ఖాన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద నాయకులు ఒకేచోట చేరి ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఉన్నాయనే సాకుతో వీరికి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. ఇంత బహిరంగంగా స్వేచ్ఛగా ఉగ్రనేతలు తిరుగుతుండటం పాక్ ప్రభుత్వం వారికి కల్పిస్తున్న పరోక్ష రక్షణకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐఎస్‌ఐ పరోక్ష రక్షణ.. భారత వర్గాల తీవ్ర అనుమానాలు
పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది అంత్యక్రియలకు పాకిస్తాన్ అధికారిక, అనధికారిక వ్యవస్థలు సహకరించాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ , అక్కడి భద్రతా బలగాల పర్యవేక్షణలోనే ఈ ఉగ్రనేతలకు రక్షణ కల్పించారని భారత భద్రతా వర్గాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హిజ్‌బుల్ ముజాహిద్దీన్, అల్–బదర్ వంటి సంస్థలు పాక్ భూభాగాన్ని కేంద్రంగా చేసుకుని కాశ్మీర్‌లో హింసను, అశాంతిని రేపుతున్నాయని భారత్ ఎప్పటి నుంచో చెప్తున్న మాటలకు ఈ వీడియో ఒక బలమైన, ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.
టెర్రరిస్టుల స్వర్గధామం పాకిస్తాన్
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్తాన్ టెర్రరిస్టుల స్వర్గధామం” అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు. 40 మంది భారత జవాన్ల ప్రాణాలు తీసిన దాడికి కారణమైన వ్యక్తినేతలకు అంతటి రాజమర్యాదలు, రక్షణ కల్పించడంపై ప్రపంచ దేశాలు మౌనం వీడాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఖండనలతో సరిపెట్టకుండా పాకిస్తాన్‌పై తీవ్రమైన ఆర్థిక, దౌత్యపరమైన అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకురావాలని నెటిజన్లు కోరుతున్నారు.
భారత భద్రతా వ్యవస్థకు హెచ్చరిక
ఈ తాజా పరిణామాలు భారత రక్షణ విభాగానికి మరోసారి హెచ్చరికగా మారాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ తన వంకర బుద్ధిని మార్చుకోలేదని స్పష్టమవుతున్న వేళ భారత్ సరిహద్దుల్లో నిఘాను, రక్షణను మరింత కఠినతరం చేయాలి. ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధుల మూలాలను దెబ్బతీయాలి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని, ఉగ్రవాద పోషణను ఎండగట్టాలి. కాశ్మీర్‌లో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా సమగ్ర వ్యూహాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు కేవలం ఒక ఉగ్రవాది ముగింపు మాత్రమే కాదు.. పాకిస్తాన్ ఉగ్రవాదంతో ఎంతగా పెనవేసుకుపోయిందో చూపించే మరో నగ్నసత్యం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు కాలక్రమేణా ఆ ఉగ్రవాద కోరల్లోనే చిక్కుకుని నశిస్తాయని చరిత్ర చెబుతోంది. మరి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంటాయా? లేదా పాకిస్తాన్ తన ఉగ్రవాద అజెండాను ఇలాగే కొనసాగిస్తుందా? అన్నది వేచి చూడాలి.
