పులివెందుల క్రెడిట్ ఎవరికి? సవిత, ఆది, బీ టెక్ రవి.. ఇంకెవరైనా ఉన్నారా?
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 30 ఏళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ ఆధిపత్యానికి చెక్ చెప్పింది.
By: Tupaki Desk | 15 Aug 2025 4:00 PM ISTపులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 30 ఏళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ ఆధిపత్యానికి చెక్ చెప్పింది. చివరి సారిగా 1995లో పులివెందుల జడ్పీటీసీని గెలుచుకున్న టీడీపీ ఆ తర్వాత కనీసం నామినేషన్ కూడా దాఖలు చేయలేకపోయింది. కనీస పోటీకి కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులను ఎదుర్కొంది. అయితే తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ సరికొత్త చరిత్రను లిఖించింది. విపక్ష వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా, అంతిమంగా ఎన్నికల్లో గెలవడమే రాజకీయంగా ప్రధానం కావడంతో టీడీపీ విజయాన్ని అంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. అయితే మూడు దశాబ్దాల్లో సాధ్యం కాని విజయం ఇప్పుడు ఎలా దక్కింది? ఈ గెలుపును ఎలా చూడాలి? ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఒక్కో గ్రామానికి ఒక్కో ఇన్చార్జి
పులివెందులలో విజయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా టీడీపీ నేతలకు ముందే హెచ్చరికలు చేశారు. ఏం చేసినా సరే గెలిచామన్న పదం ఒక్కటే వినిపించాలని చంద్రబాబు స్పష్టం చేశారని చెబుతున్నారు. పార్టీ నేతల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టాలని, పార్టీ అభ్యర్థి లతా రెడ్డి విజయం కోసం కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా కూటమి నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని, జిల్లాకు చెందిన నేతలు అంతా తలా ఒక గ్రామాన్ని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. దీంతో కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలతోపాటు బీజేపీ, జనసేన నేతలు పులివెందులలో వాలిపోయారు. వారం రోజులుగా శక్తికి మించి పోరాడి ఘన విజయం సాధించారు.
చంద్రబాబు పాలన ఒక్కటే కారణమా?
పులివెందుల విజయం చంద్రబాబు పాలన వల్లే సాధ్యమైందని పార్టీ నేతలు అంతా ప్రకటించినా, అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎన్నికల వ్యూహ రచన ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సివుంటుందని చెబుతున్నారు. సుమారు వారం రోజుల పాటు జరిగిన ప్రచారంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుట్టా చైతన్య రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పులివెందుల పార్టీ ఇన్చార్జి బీటెక్ రవి, పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి వంటివారు పులివెందులలో తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరు ఒక్కో పంచాయతీని పర్యవేక్షిస్తూ పోలింగుకు పకడ్బందీ వ్యూహరచన చేశారు. దీంతో పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించడంతోపాటు వైసీపీకి డిపాజిట్ దక్కకుండా చేశారని అంటున్నారు.
పులివెందులలో మంత్రి సవిత
జిల్లా ఇన్ చార్జి మంత్రి హోదాలో సవిత వారం పాటు పులివెందులలోనే తిష్టవేసి గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని పనిచేశారని కార్యకర్తలు చెబుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సవిత మాజీ సీఎం జగన్ అడ్డాలో ఏ మాత్రం భయపడకుండా తిరగడం విశేషమంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పులివెందుల వంటి ప్రాంతంలో ఓ మహిళా నేత ఇలా పనిచేయడం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గెలుపు క్రెడిట్ సవితే ఒక్కరి అకౌంటులో వేయడం సరికాదని కూడా అంటున్నారు. మంత్రి సవితకు సమాంతరంగా ఇతర నేతలు కృషిని గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
వ్యూహాత్మకంగా అభ్యర్థి ఎంపిక
పులివెందుల జడ్పీటీసీగా బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి పోటీ చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా పలుమార్లు పోటీ చేసిన బీటెక్ రవి మాజీ సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ ను ఢీకొట్టాలంటే రవి కుటుంబానికి తప్ప వేరెవరికి సాధ్యం కాదన్న ప్రచారం ఉంది. అందుకే పులివెందుల బీటెక్ రవి సొంత ప్రాంతం కాకపోయినా, ఆయన భార్యను అభ్యర్థిగా నిలబెట్టారని చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ కూడా మీడియాతో మాట్లాడుతూ, పులివెందులలో బీటెక్ రవి ఎవరు? ఆయన సొంత మండలం కాదు కదా? అని వ్యాఖ్యానించారంటే.. బీటెక్ రవి భార్యను అభ్యర్థిగా నియమించి వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని అంటున్నారు. అదే సమయంలో తమ పార్టీకి అధికారం ఉంది? జిల్లా నేతలు అంతా తనతోనే ఉన్నారని ధీమాతో ఉండకుండా రవి కూడా చాలా కష్టపడ్డారని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని ఎన్నికల ముందు పార్టీలోకి తీసుకురావడం కూడా పైచేయి సాధించడానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు.
విభేదాలకు ఫుల్‌స్టాప్
ఇక ఇదే సమయంలో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డితో బీటెక్ రవి వర్గానికి ఉన్న విభేదాలను కూడా చక్కదిద్దడంలో పార్టీ అధిష్టానం సక్సెస్ అయిందని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన నుంచి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వర్గంతో బీటెక్ వర్గానికి ఏ మాత్రం పొసగడం లేదని గతంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. అయితే అప్పట్లో ఇద్దరి నేతల మధ్య విభేదాలను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి పని వారు చేసుకోమని సుతిమెత్తిగా చెప్పి వదిలేసింది. కానీ, పులివెందుల ఎన్నికల సందర్భంగా ఈ విభేదాలను పక్కన పెట్టాలని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే వార్నింగు ఇచ్చారు. అంతేకాకుండా పులవెందులలో స్థానికుడైన రాంభూపాల్ రెడ్డికి లతారెడ్డి గెలుపు బాధ్యతను అప్పగించింది పార్టీ హైకమాండ్. యువనేత లోకేశ్ కూడా పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధంపై ఒకటికి రెండు సార్లు మాట్లాడటంతో వారంరోజుల ప్రచారపర్వంలో ఎక్కడా గ్రూపులు కనిపించలేదు. ఇలా పార్టీ యంత్రాంగం అంతా ఏకతాటిపై కష్టపడి పనిచేయడం కూడా విజయానికి దారులు వేసిందని అంటున్నారు. అయితే టీడీపీ నేతలే కాకుండా ఈ విజయంలో బీజేపీ నేతల పాత్ర కూడా ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది.
బీజేపీ నేతల వ్యక్తిగత ప్రతిష్ట
పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయాన్ని బీజేపీ నేతలు ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తమ వ్యక్తిగత ప్రతిష్ఠకు తీసుకున్నారని చెబుతున్నారు. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సీఎం రమేశ్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. పులివెందులలో విజయానికి ఆయన ఆర్థికంగా సహకరించారని చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు మించిన రీతిలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పనిచేశారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో మాట్లాడి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. పులివెందుల పక్క నియోజకవర్గమైన జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ కుటుంబంతో కలిసి నడిచిన ఆదినారాయణరెడ్డికి పులివెందులలో జగన్ బలాబలాలపై స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థిని విజయతీరాలకు చేర్చేలా కృషి చేశారని అంటున్నారు.
వీరే కాకుండా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప పార్లమెంటు ఇన్చార్జి భూపేశ్ రెడ్డి, ఎమ్మెల్యే పుట్టా చైతన్యరెడ్డి వంటివారు సైతం నిరంతరం పులివెందులలో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించడం, ప్రతిపక్ష వైసీపీకి చోటు ఇవ్వకుండా దూసుకుపోయేలా కార్యకర్తలను ముందుండి నడిపించడంతో టీడీపీ ఘన విజయం సాధించిందని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమష్టిగా పనిచేయడం, ఎక్కడా సమన్వయ లోపం లేకుండా టీడీపీ అధిష్టానం పర్యవేక్షించడం వల్ల మాజీ సీఎం జగన్ కోటను బద్ధలు కొట్టగలిగారని చెబుతున్నారు.
