పులివెందులలో జమ్మలమడుగు, కమలాపురం ఓటర్లు.. వైసీపీ తీవ్ర ఆరోపణలు
పోలీసులు దొంగ ఓట్లు వేసే వాళ్లను అడ్డుకోకుండా, వారే దగ్గర ఉండి మరీ దొంగ ఓట్లు వేయిస్తున్నారని అంబటి ఆరోపించారు.
By: Tupaki Desk | 12 Aug 2025 7:55 PM ISTపులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ పెద్ద ఎత్తున రిగ్గింగుకు పాల్పడిందని వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. పులివెందులలో ఎటువంటి బలం లేని టీడీపీ పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెప్పించుకుని దొంగ ఓట్లు వేసిందని ఆరోపించింది. తమ నియోజకవర్గంలో టీడీపీకి 20 శాతం ఓట్లు కూడా ఉండవు. అందుకే దొంగ ఓట్ల కోసం బయట నుంచి మనుషులను తెప్పించుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా ఎప్పుడూ ఎన్నడూ చూడని విధంగా టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2017లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కంటే టీడీపీ దారుణంగా వ్యవహరించిందని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారని, దొంగ ఓట్లు వేసిన వారి పేర్లతో సహా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంబటి రాంబాబు తెలిపారు. పోలిస్ యంత్రాంగం వైసీపీ నేతలను బూతుల దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు. మా పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం తిప్పారని మండిపడ్డారు. ఇవాళ ఖాకీ దుస్తులు వేసుకున్న సంగతి మరచిపోయి టీడీపీ ఏజెంట్ లా ఎన్నిక జరిపే కార్యక్రమం డీఐజీ కోయ ప్రవీణ్ చేపట్టారని ఆరోపించారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు.
పోలీసులు దొంగ ఓట్లు వేసే వాళ్లను అడ్డుకోకుండా, వారే దగ్గర ఉండి మరీ దొంగ ఓట్లు వేయిస్తున్నారని అంబటి ఆరోపించారు. పులివెందుల వైసీపీ కార్యాలయంలో అవినాశ్ రెడ్డి కూర్చొంటే డీఐజీ స్వయంగా వెళ్లారని అంబటి రాంబాబు తెలిపారు. మరో డీఎస్పీ నానా దుర్భాషలాడుతూ కార్యాలయం బయట ఉన్నవారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘‘మీరు ఖాకీలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి రాజకీయాలు చూడలేదని’’ విమర్శించారు. మీరు తీసుకువచ్చిన సంస్కృతి మిమ్మల్ని, మీ కొడుకును వెంటాడదా? అంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.. మీకు ఓటేసిన వాళ్లకు చంద్రబాబు ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా? అని ప్రశ్నించారు. పోలీసులే ఎన్నికలను చేసే దుష్ట సంప్రదాయానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని అంబటి ఆరోపించారు.
