పులివెందుల : జగన్ కు బోలెడంత నమ్మకం
పులివెందుల వైఎస్ కుటుంబం కంచుకోట.. అక్కడ ఏ ఎన్నికైనా వైఎస్ కుటుంబం మాటే శాసనం అన్నట్లు సాగిపోతుంది.
By: Tupaki Desk | 11 Aug 2025 10:38 AM ISTపులివెందుల వైఎస్ కుటుంబం కంచుకోట.. అక్కడ ఏ ఎన్నికైనా వైఎస్ కుటుంబం మాటే శాసనం అన్నట్లు సాగిపోతుంది. అటువంటి కోటలో తొలిసారి భీకర సవాల్ ఎదుర్కొంటోంది వైఎస్ కుటుంబం. అయినా తమ పరపతిపై వారికి అచంచల విశ్వాసం కనిపిస్తోంది. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అంతిమ విజయం తమదే అంటోంది వైఎస్ కుటుంబం. దీనికి మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చేసిన సుదీర్ఘ ట్వీట్ ను ఉదహరిస్తున్నారు. పులివెందులలో గెలుపు కోసం అధికార కూటమి ఎన్నో దురాగతాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ట్వీట్ చేసిన జగన్.. ‘‘అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.’’ అంటూ ముగించారు. అంటే ప్రజలు తమ వైపే ఉన్నారని, విజయం తమదేనన్న నమ్మకం ఆయనలో ప్రస్ఫుటమవుతోందని అంటున్నారు. పులివెందులలో గెలుపుపై జగన్ కు ఎందుకంత నమ్మకం? అనే అంశమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మంగళవారం జరగనుంది. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. సరిగ్గా ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. వారం రోజులుగా హోరెత్తిన ప్రచారంలో వైసీపీ ఎదురీదుతున్నట్లు కనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు. అధికార పార్టీ అన్నిరకాల ప్రయోగాలు చేయడం, వాటిని ఎదుర్కోవడం వైసీపీ నేతలకు శక్తికి మించిన పని అయిందని చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలు తమవైపే ఉన్నారని, ధర్మమే గెలుస్తుందని జగన్ ట్వీట్ చేయడంతో నైరాశ్యంలో చేరుకున్న వైసీపీ అభిమానులు కాస్త కుదుటుపడ్డారు. జగన్ ట్వీట్ తో వారిలో కొత్త ఆశలు చిగురించినట్లు చెబుతున్నారు.
అయితే పులివెందుల క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన వారు.. అక్కడ వైఎస్ కుటుంబాన్ని కాదని, ఇతరులు విజయం సాధించడం అంత ఈజీ కాదని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు అంటే దాదాపు మూడు దశాబ్దాల క్రితం వరకు ఇక్కడ వైఎస్ కుటుంబానికి దీటుగా రాజకీయాలు నడిచేవని, కానీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పరపతి పెరిగిన తర్వాత పులివెందుల ఆ కుటుంబం కంచుకోటగా మారిపోయిందని చెబుతున్నారు. ఇక వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన 2004 తర్వాత పులివెందులలో వైఎస్ కుటుంబం పునాదులు మరింత బలపడ్డాయని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయం వేరు.. పులివెందుల పాలిటిక్స్ వేరుగా చూడాలని చెబుతున్నారు.
అందుకే అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పులివెందుల ప్రజలు తమను తిరస్కరించే పరిస్థితి ఉండదని జగన్ బలంగా నమ్ముతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ కూడా పులివెందులలో జెండా ఎగరేస్తామని నమ్మకంగా చెప్పలేకపోతుందని ఎత్తిచూపుతున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే వైసీసీ బలహీన పడిందని చెప్పడంలో ఎంతో కొంత వాస్తవం ఉందని, అదే సమయంలో టీడీపీ కాస్త మెరుగైన పరిస్థితికి చేరుకుందని అంటున్నారు. అయితే టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించే పరిస్థితి ఉందని ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పులివెందుల జగన్ అడ్డా కావడమే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
