జగన్ కే కాదు చంద్రబాబుకు పులివెందుల సవాల్
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తోంది. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయిస్తోంది.
By: Tupaki Desk | 11 Aug 2025 1:00 PM ISTఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తోంది. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయిస్తోంది. మరోవైపు విపక్ష వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్ సొంత ఇలాకాలో అనుకోకుండా వచ్చిన జడ్పీటీసీ ఉప ఎన్నిక అధికార, ప్రతిపక్షాలకు అగ్నిపరీక్ష మారింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల సొంత అడ్డాలో గెలిచి తమ విజయం పరిపూర్ణమని చాటుకోవాలని అధికార పార్టీ తాపత్రయ పడుతుండగా, తమ కోటలో వేరొకరి చోటివ్వడం కుదరదని తేల్చిచెప్పడం మాజీ సీఎం జగన్మోహనరెడ్డిది అంటున్నారు. దీంతో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ పులివెందుల ఎన్నికను ఓ పరీక్షగా భావిస్తున్నారని అంటున్నారు.
చూడటానికి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా చిన్నదే.. కానీ, ఆ స్థానాన్ని కైవసం చేసుకోడానికి జరుగుతున్న రాజకీయ యుద్ధం మాత్రం కురుక్షేత్రాన్ని తలపిస్తోందని అంటున్నారు. నిజానికి రోడ్డు ప్రమాదంలో జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణించడంతో ఏర్పడిన ఖాళీకి ఎప్పుడో ఎన్నిక జరగాల్సి వుంది. 2022లోనే మహేశ్వర రెడ్డి మరణించగా, అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ఉప ఎన్నికను నిర్వహిస్తే ఇప్పుడు ఇంత రచ్చ జరిగేది కాదని అంటున్నారు. మరోవైపు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహించి వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్ కు చెమటలు పట్టించాలని టీడీపీ భావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో పులివెందుల రంగంలోకి దిగింది. రాష్ట్రంలో అధికారం ఉన్న సమయంలో పులివెందులలో గెలవడం టీడీపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది.
సొంత అడ్డాలో గెలవడం జగన్ కు ఎంత అవసరమో.. పులివెందులను కైవసం చేసుకోవడం టీడీపీకి, అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అంతే అవసరంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పులివెందులలో గెలిస్తే జగన్ ను ఆయన సొంత ఇలాకాలో దెబ్బ కొట్టామని, ఆయన గత ఎన్నికల ముందు పిలుపునిచ్చిన వైనాట్ 175 నినాదానికి ప్రతిగా వైనాట్ పులివెందులగా మార్చాలని టీడీపీ చాటుకోవాలని చూస్తోంది. అదేసమయంలో ఫలితం తారుమారు అయితే ఎంత అధికారం ఉన్నా, జగన్ కు ప్రజాబలం ఉందన్న విషయాన్ని అంగీకరించాల్సివస్తుందని అంటున్నారు. అటు జగన్ కూడా గెలిస్తే తన పరిపతికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పుకుంటారు. కానీ, ఓడితేనే ఆయన ఏ కారణం చెప్పగలరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అధికార పార్టీ బలప్రయోగం ద్వారా పులివెందులను చేజిక్కించుకుందని చెప్పినా, ఆ వాదనకు అంతగా బలం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పులివెందుల ఎన్నిక అధికార, విపక్షాలకు ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలకు పెద్ద చాలెంజ్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
