Begin typing your search above and press return to search.

పులివెందుల గెలవాలంటే ఎన్ని ఓట్లు కావాలి?

పులివెందుల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వస్థలం కావడంతో ఉప ఎన్నికకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది.

By:  Tupaki Desk   |   10 Aug 2025 11:54 AM IST
పులివెందుల గెలవాలంటే ఎన్ని ఓట్లు కావాలి?
X

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత ఇలాకాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. 30 ఏళ్ల తర్వాత జడ్పీటీసీ పదవికి ఎన్నిక జరుగుతోంది. 1995లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ తుమ్మల మహేశ్వరరెడ్డి మరణంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో మహేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీని ఏకగ్రీవం ద్వారా భర్తీ చేయాలని వైసీపీ భావించింది. అయితే అధికార కూటమి ఎన్నికకే మొగ్గు చూపడంతో పోలింగ్ అనివార్యమైంది. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ, నియెజకవర్గ ఇన్ చార్జి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె విజయం కోసం టీడీపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారని చెబుతున్నారు.

10,500 ఓట్లు

పులివెందుల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వస్థలం కావడంతో ఉప ఎన్నికకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీడీపీ సీనియర్ నేతలు అందరినీ రంగంలోకి దింపింది. దాదాపు 200 మంది నేతలు పులివెందులలో మోహరించారని చెబుతున్నారు. 9 పంచాయతీలు, 10 వేల 500 ఓట్లు ఉన్న పులివెందులలో దాదాపు 5 వేల ఓట్లు దక్కించుకున్నవారు గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అధికార పక్షం అన్నిరకాలుగా బలప్రయోగం చేస్తుండటంతో విపక్ష వైసీపీ తమ కంచుకోటలో అనేక సవాళ్లు ఎదుర్కుంటోందని అంటున్నారు.

వైఎస్ కుటుంబ నిర్ణయమే ఫైనల్

పులివెందుల జడ్పీటీసీగా ఎవరు ఉండాలనేది వైఎస్ కుటుంబమే నిర్ణయించేది. గత 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మూడు దశాబ్దాల అనంతరం వైఎస్ కుటుంబ చేతుల్లో నుంచి నిర్ణయాధికారం ప్రజా తీర్పుకు మారింది. సుమారుగా 10 వేల 500 ఓట్లు ఉన్న పులివెందుల జడ్పీటీసీ పరిధిలో తొమ్మిది పంచాయతీలను నాయకులు వాటాలుగా పంచుకున్నారు. ఒక్కో గ్రామం బాధ్యతను ఒక్కొక్కరు తీసుకున్నారు. రెండు పార్టీలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుండగా, టీడీపీ కూటమి అధికార బలంతో ఎన్నిక తీరునే మార్చేసిందని అంటున్నారు.

5 వేల ఓట్లు వస్తే చాలు

5 వేల ఓట్లు సాధిస్తే పులివెందుల జెండా ఎగరయొచ్చన్న వ్యూహంతో ఇరుపార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ మండల పరిధిలో ఎప్పుడూ వైసీపీకి ఏకపక్షంగా ఓటింగ్ జరిగేదాని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఓట్లు సాదించేదని అంటున్నారు. పది వేల ఓట్లకు టీడీపీ ఎప్పుడు కూడా ఇక్కడ వెయ్యి ఓట్లు సాధించిన పరిస్థితి లేదంటున్నారు. వైసీపీకి పూర్తిస్థాయి బలం, బలగం ఉన్న పులివెందుల మండలంలో తొలిసారి టీడీపీ పుంజుకోవడమే రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. అయితే టీడీపీ బలం గెలిచే వరకు తీసుకువెళుతుందా? వైసీపీకి ముచ్చమెటలు పట్టించేవరకు మాత్రమే పరిమితమవుతందా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఏదిఏమైనా గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన టీడీపీ ఈ రెండు రోజులు అనుసరించేబోయే వ్యూహమే ఉత్కంఠ రేపుతోంది.