జగన్ కి ఆ ట్యాగ్...బాధంతా అదేనా ?
పులివెందుల పులి అని టైగర్ అని వైసీపీ వర్గాలు వేన్నోళ్ళ జగన్ ని పొగుడుతాయి. అయితే తాజాగా అదే పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది.
By: Tupaki Desk | 14 Aug 2025 11:20 PM ISTపులివెందుల పులి అని టైగర్ అని వైసీపీ వర్గాలు వేన్నోళ్ళ జగన్ ని పొగుడుతాయి. అయితే తాజాగా అదే పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. దాంతో ఇక మీదట జగన్ పులివెందుల పులి అని ట్యాగ్ చేసి పిలవడం కుదురుతుందా అన్నది అభిమానుల ఆవేదనగా ఉంది. నిజానికి పులివెందుల ఓటర్లు వైసీపీని జగన్ ని సమాదరించారు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ పరువు పోయే విధంగా ఫలితం వచ్చింది.
ఎన్ని చెప్పినా అంతేనా :
విజయం ఎపుడూ విజయమే. ఓటమి ఓటమే. రిగ్గింగులు అని అధికార బలం అని దౌర్జన్యాలు అని ఎన్ని చెప్పినా కూడా చివరికి అవన్నీ రాజకీయ విన్యాసాలుగానే నిలుస్తాయి. అంతే తప్ప పోలింగ్ బాక్స్ లో పడినది ఏదైనా పవిత్రమే. అదే ఓటుగా మారుతుంది. అదే తీర్పుని డిసైడ్ చేస్తుంది. పోలింగ్ బాక్స్ లో ఓటు ఎలా వేయించుకోవడమో అనేక రకాలుగా ఆలోచించుకోవాలి. అంతే కాదు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ దాని కోసమే. కండబలమా బుద్ధి బలమా ఇవన్నీ పూర్వ పక్షం చర్చగానే ఆఖరుకు మిగిలిపోతాయి.
ఓటమెంత బరువో :
వైసీపీకి చాలా కాలంగా ఏమీ బాగా లేదు. రాజకీయ జాతకం చూస్తే అసలు ఏమీ కలసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని మరచిపోక ముందే ఏకంగా జగన్ సొంత ఇలాకాలో ఒక చిన్న ఎన్నికల్లో బాంబు లాంటి ఫలితం వచ్చింది. వైసీపీకే ఏకంగా డిపాజిట్లు పోయాయి. వైసీపీ పుట్టాక ఎపుడూ ఇలా జరగలేదు. కాంగ్రెస్ కి డిపాజిట్లు గల్లంతు అయ్యాయని ఎపుడూ గేలి చేసే వైసీపీకి ఇపుడు తన పరిస్థితి అదే అని అర్ధమయ్యేసరికి ఓటమెంత బరువైనదో తెలిసి వస్తోంది అని అంటున్నారు.
లైట్ తీస్కో లేనిదే :
ఒక్క ఎన్నికే కదా అని లైట్ తీసుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే పులివెందుల జగనన్న అడ్డా అని నిబ్బరంగా అభిమానులు నినదించేవారు. మా నాయకుడు ఒక్కసారి అడుగు పెట్టకముందే ఏదైనా ఎవరైనా ఎంతైనా అని బిగ్ సౌండ్ చేసేవారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. పులివెందులలోనే కూసాలు కదిలిపోతే ఇక వేరే చోట ఏమైనా చెప్పాలా అన్నదే నిర్వేదంగా ఉంది. దాంతో వైసీపీ శ్రేణులను ఈ ఫలితం ఒక్క లెక్కన బాధించడం లేదు అని అంటున్నారు
డీ మోరలైజ్ అయ్యేలా :
కార్యకర్తలలో నైతిక స్థైర్యం తగ్గిపోయింది. ఏమిటి ఇలా జరుగుతోంది అని వారికి వారే అనుకునే నేపథ్యం ఉంది. వైసీపీకి ఓటమి లేదు అనుకుంటే 2024 ఫలితాలు కళ్ళు తెరిపించాయి. వైసీపీ కంచుకోటలో తిరుగులేదు అని అనుకుంటే ఆ ముచ్చటా తీర్చేశాయి. ఇపుడు పులివెందులలో మా మాటే శాసనం అని బల్ల గుద్దితే రిజల్ట్ మాత్రం వేరేగా వచ్చింది. దీంతో వైసీపీ ఏమి చేసి మళ్ళీ తన నైతిక బలాన్ని సాధించుకుంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు.
