జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టుకు వైసీపీ
ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై ప్రతిపక్షం వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
By: Tupaki Desk | 14 Aug 2025 11:47 AM ISTఉమ్మడి కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై ప్రతిపక్షం వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రెండు చోట్ల కేంద్ర భద్రత బలగాల బందోబస్తు మధ్య రీ పోలింగ్ నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. దీంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు జడ్పీటీసీ స్థానాలపై ఈ రోజు కౌంటింగ్ జరుగుతుండగా, హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యే సమయానికి పులివెందల ఫలితం బయటకు వచ్చేసింది. ఒంటిమిట్ట స్థానం ఓట్ల లెక్కింపు మధ్యలో ఉంది.
మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతోపాటు ఆయన సొంత జిల్లాకు చెందిన ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరిగింది. అయితే ఓటింగ్ సందర్భంగా అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ ఏజెంట్లను అనుమతించలేదని, స్థానికులను ఓటు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా పక్క నియోజకవర్గాలకు చెందిన వారిని తీసుకువచ్చి ఓట్లు వేయించారని వైసీపీ ఆరోపించింది. రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కోర్టును ఆశ్రయించింది.
అయితే కోర్టు విచారణ ప్రారంభానికి ముందే పులివెందల ఫలితం రావడంతో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ అభ్యర్థన మేరకు ఎన్నికల ఫలితంపై స్టే ఇస్తారా? లేక మళ్లీ పోలింగు నిర్వహణకు ఆదేశిస్తారా? అనే చర్చ జరుగుతోంది. వైసీపీ పిటిషన్లపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తరఫున కూడా అఫిడవిట్లు దాఖలు చేయాల్సివున్నందున హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
