Begin typing your search above and press return to search.

పులివెందుల Vs కుప్పం.. రెండింటి మధ్య తేడా ఇదే..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

By:  Tupaki Desk   |   11 Aug 2025 6:00 PM IST
పులివెందుల Vs కుప్పం.. రెండింటి మధ్య తేడా ఇదే..
X

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వైనాట్ 175 అనే నినాదంతో గత ఎన్నికల ముందు జోరుచూపిన మాజీ సీఎం జగన్ కు వైనాట్ పులివెందులతో సమాధానం చెప్పాలని అధికార కూటమి తెగ ప్రయత్నాలు చేస్తోంది. కేవలం ఒక్క జడ్పీటీసీ పదవి కోసం యావత్ ప్రభుత్వ యంత్రాంగం పులివెందులపై స్పెషల్ ఫోకస్ చేసిందని అంటున్నారు. ఓ చిన్న మండల స్థాయి పదవి కోసం ఇంతలా కష్టపడాలనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే గత ఎన్నికలకు ముందు జగన్ నినాదం వైనాట్ 175కు ప్రధాన కారణం కుప్పంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడం. ప్రధానంగా కుప్పం మున్సిపాలిటీని అప్పట్లో చేజిక్కించుకున్న వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని ప్రతినబూనింది. అయితే గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అవడంతో ఇప్పుడు అధికార కూటమి ఆపరేషన్ పులివెందులకు అధిక ప్రాధాన్యమిస్తోంది. దీంతో పులివెందుల Vs కుప్పంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని అధికార కూటమి పంతం పట్టడంతో ఈ ఎన్నికకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. వాస్తవానికి టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ స్థాయిలో పులివెందులలో గెలుపు కోసం ప్రయత్నాలు చేయలేదని పరిశీలకులు చెబుతున్నారు. 45 ఏళ్ల టీడీపీ చరిత్రలో పులివెందులలో పాగా కోసం ఆ పార్టీ గట్టిగా పోరాడలేదు. ఇక గత 30 ఏళ్లలో స్థానిక సంస్థల్లో పోటీకి నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. కానీ తొలిసారిగా ఏడాది పదవీకాలం ఉన్న జడ్పీటీసీ పదవి కోసం సర్వశక్తులు ప్రయోగిస్తోంది. దీనికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా 2021 నవంబరులో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగా టీడీపీ పులివెందులలో సత్తా చాటాలని భావిస్తోందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం టీడీపీకి కంచుకోట. అయితే 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఏకపక్ష గెలుపు కోసం ప్రయత్నించింది. ఆ సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు వచ్చినా, ఎన్నికల్లో భారీ విజయంతో అవన్నీ పటాపంచలైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని సైతం వైసీపీ నేతలు విడిచిపెట్టలేదు. కుప్పంలో చంద్రబాబు పట్టుకోల్పోయారు అన్న విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో కుప్పం మున్సిపాలిటీలో వైసీపీని గెలిపించుకున్నారు. ఈ క్రమంలో అప్పట్లో ఎలాంటి విమర్శలు వచ్చినా నాటి ప్రభుత్వ పెద్దలు లెక్కచేయలేదు. దీంతో నాటి పెద్దలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అదే వ్యూహాన్ని పులివెందులల్లో అమలు చేయాలని టీడీపీ కూటమి పెద్దలు కుతూహలం ప్రదర్శిస్తున్నారు. అయితే కుప్పం, పులివెందుల నియోజకవర్గాలకు చాలా తేడాలు ఉన్నవిషయాన్ని ప్రభుత్వ పెద్దలు విస్మరిస్తున్నారని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

కుప్పం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైనా.. అక్కడ చంద్రబాబు కుటుంబం ఎవరూ ఉండరని, అదే సమయంలో ఆ నియోజకవర్గం మొత్తం బీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఆ నియోజకవర్గంలో చంద్రబాబు వరకు ఒకలా ఫలితాలు ఉంటే, మిగతా ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటున్నారు. కుప్పం నియోజకవర్గం వరకు స్థానిక ఎన్నికల్లో టీడీపీతోపాటు మిగతా పార్టీల ప్రభావం గతంలో కనిపించేదని గుర్తు చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో పులివెందులలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నమని గుర్తు చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత సామాజిక వర్గం ప్రభావం చూపుతుందని, గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ కుటుంబం తప్ప వేరే వారి ఆధిపత్యం ఇక్కడ లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 2021 ఎన్నికల నాటి చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకోడానికి పులివెందుల సరైన వేదిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ లెక్కలు గమనించిందో లేదో కానీ, టీడీపీ ఎన్నికల కదన రంగంలో దూకడంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారిందని అంటున్నారు.