పులివెందులలో జగన్ రోడ్ షో.. పోలింగ్ వేళ హైడ్రామాపై టీడీపీ అభ్యంతరాలు
పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
By: Tupaki Desk | 1 Nov 2026 2:30 PM ISTపులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రోడ్డుపైకి రావడం.. భారీ వాహనాలతో ర్యాలీగా వెళ్లడం ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు ఈ తరహా వ్యవహారాలకు ఎలా అనుమతి ఇస్తారంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనను ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే చర్యగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పులివెందులలో తొలిసారిగా ఎన్నికలు ప్రశాంతంగా.. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే వైసీపీ నేతల వ్యవహారశైలిపై టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. నామినేషన్ల దశ నుంచే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని.. ఇప్పుడు పోలింగ్ రోజున కూడా వివాదాలకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు.
జగన్ పులివెందులకు చేరుకోవడానికి ముందే హెలికాప్టర్ ల్యాండింగ్ అంశం వివాదాస్పదమైంది. అనుకున్న సమయానికి కంటే ముందే వచ్చి జగన్ రచ్చ చేశారని అంటున్నారు.. దీంతో నిబంధనల ప్రకారం ల్యాండింగ్ విషయంలో వివాదమైంది. టైం పాటించకుండా అధికారులను కంగారుపెట్టిన జగన్ తీరు తీవ్ర వివాదమైంది. హెలికాప్టర్ కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి నానా హంగామా సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. చివరకు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. జగన్ సమయపాలన పాటించకపోవడమే ఈ వివాదానికి కారణమని అంటున్నారు.
మరోవైపు జగన్ పులివెందులలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేసిన హంగామా తీవ్ర వివాదమైందని టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో భారీ వాహనాలతో ర్యాలీగా వెళ్లడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపు తనను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూనే మరోవైపు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఇక పోలింగ్‌కు ముందు పులివెందులలో వాహనాలు దగ్ధమైన ఘటన కూడా రాజకీయ దుమారం రేపింది. మూడు కార్లు, పది ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ ను వైసీపీ నేతలు దగ్ధం చేసినట్టు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
నామినేషన్ల దశ నుంచి పులివెందులలో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల విషయంలోనూ ఇరు పార్టీల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు గొడవలకు కారణమవుతున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హింసను ప్రేరేపించేలా ఎవరైనా వ్యవహరించినా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే పులివెందులలో వైసీపీ కార్యకర్తల రాళ్లదాడులు, తోపులాటలతో బీభత్సం సృష్టించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ దూకుడుతో ఎన్నికల ప్రక్రియకు భంగం కలగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పులివెందుల ఎన్నికలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకే ముప్పు తెచ్చిపెట్టాయని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ పర్యటన, హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదం.. ర్యాలీ, వాహనాల దహనం, పోలింగ్ ఏజెంట్లపై ఆరోపణలతో ఇలా వరుస పరిణామాలు ఎన్నికల వేడిని మరింత పెంచాయి. ఈ వ్యవహారంపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వైసీపీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది వేచి చూడాలి.
