పుస్తెలు అమ్మైనా పులస తినాలని ఊరికే అనలేదు గోదారోళ్లు!
ఈ క్రమంలో... శనివారం గోదావరిలో పడిన ఓ పులస చేప.. యానాం మార్కెట్ వేలం పాటలో రూ.12 వేలకు అమ్ముడైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 July 2025 4:00 AM ISTగోదావరి జిల్లాల ప్రజలకు, చేపలకు ఉన్న సంబంధం వేరే లెవెల్ అని చెబుతుంటారు. చేపలు, రొయ్యలు, పీతలు అనేవి మెజారిటీ గోదావరి జిల్లాల ప్రజల ఆహారంలో అత్యంత కీలక భాగం పోషిస్తుంటాయని చెబుతారు. ఇక ఈ సీజన్ లో వచ్చే పులస సంగతి చెప్పేపనేలేదు. పుస్తెలు అమ్మైనా పులస తినాలనే స్థాయిలో కొటేషన్స్ పెట్టి ఉంచారు. ఈ నేపథ్యంలో మళ్లీ పులస సందడి మొదలైపోయింది.
అవును... గోదావరిలో పులస చేప సందడి మొదలైపోయింది. అప్పుడే ఈ ఏడు రికార్డ్ ధరలు నమోదైపోతున్నాయి. జూలై నుంచి అక్టోబర్ మధ్య సముద్రంలో నుంచి గోదావరిలోకి వచ్చి దొరికే ఈ అరుదైన పులసలను దక్కించుకునేందుకు మాంసాహార ప్రియులు పోటీలు పడుతున్నారు. ఈ క్రమంలో వరుసగా రెండు రోజుల్లో రెండు పులస చేపలు మార్కెట్ లో సందడి చేశాయి. ఇక ధరలు భారీగానే ఉన్నాయి.
ఈ క్రమంలో... శనివారం గోదావరిలో పడిన ఓ పులస చేప.. యానాం మార్కెట్ వేలం పాటలో రూ.12 వేలకు అమ్ముడైన సంగతి తెలిసిందే. అదే యానాంలోని రాజీవ్ బీచ్ లో ఆదివారం మత్స్యకారులు నిర్వహించిన వేలంలో ఓ పులసను చేపల వ్యాపారం చేసే పొన్నమండ రత్నం రూ.22 వేలకు దక్కించుకున్నారు. ఈ పులస చేప బరువు 1.800 కేజీలుగా ఉంది.
హోప్ ఐలాండ్ కు చెందిన మల్లాడి ప్రసాద్ వలకు ఈ చేప చిక్కింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రసాద్... గతేడాది ఓ పులసను రూ.23 వేలకు విక్రయించినట్లు చెప్పారు. ప్రస్తుత సీజన్లో లభ్యత తక్కువగా ఉండటంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగాళాఖాతం నుంచి సంతానోత్పత్తి కోసం గోదావరి వరద నీటిలోకి వచ్చి మత్స్యకారులకు చిక్కే వీటిని కొనేందుకు ఏటా తీవ్ర పోటీ ఉంటుంది.
