పీఎస్సార్ ను అస్సలు వదిలేదేలే.. ఏపీపీఎస్సీ అవినీతిపై మరో కేసు!
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 29 April 2025 8:21 AMసీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినీ నటి కాదంబరి జెత్వాని కేసులో ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉన్న పీఎస్సాఆర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గతంలో ఆయన ఏపీపీఎస్సీ చైర్మనుగా ఉండగా గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారని తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం విచారణ బాధ్యతను ఓ సీనియర్ అధికారికి అప్పగించాలని చూస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుతం సినీ నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా అరెస్టు చేశారనే అభియోగాలతో పీఎస్సాఆర్ ఆంజనేయులును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండు ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం పెద్దలకు అత్యంత సన్నిహితంగా మెలిగిన పీఎస్సాఆర్ ను అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను వేధింపులకు గురిచేసిన పీఎస్సాఆర్ పై ఉన్న పెండింగు కేసులను తిరగదోడాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆయనపై జెత్వానీ కేసుతోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు కూడా ఉంది. అదేవిధంగా తాజాగా ఏపీపీఎస్సీ అవినీతి కేసు నమోదు చేసి ఏసీబీకి అప్పగించాలని చూస్తున్నారని అంటున్నారు.
తాజా పరిణామాలు పరిశీలిస్తే పీఎస్సారును మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని మాదిరిగా వరుస కేసుల్లో అరెస్టు చూపించి, కొన్నాళ్లు జైలులోనే ఉంచే ప్లాన్ ప్రభుత్వం అమలు చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జెత్వానీ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు దర్యాప్తునకు సహకరించడం లేదని విచారణాధికారులు చెబుతున్నారు. దీంతో ఆయనను మళ్లీ కస్టడీకి కోరతారా? లేక రిమాండుకు తరలించి మరో కేసులో అరెస్టు చూపిస్తారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.