Begin typing your search above and press return to search.

కర్మ రిటర్న్స్.. సీనియర్ ఐపీఎస్ అధికారిని వదలని పాపం..?

కర్మ రిటర్న్స్.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న వేదాంతం.. ఎవరినీ కర్మ వదలనే ఈ సిద్ధాంతం సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో మరోసారి నిజమైందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 7:00 AM
కర్మ రిటర్న్స్.. సీనియర్ ఐపీఎస్ అధికారిని వదలని పాపం..?
X

కర్మ రిటర్న్స్.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న వేదాంతం.. ఎవరినీ కర్మ వదలనే ఈ సిద్ధాంతం సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో మరోసారి నిజమైందని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ప్రతిపక్ష నేతలను వెంటాడి వేటాడి అరెస్టులు చేయించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సీనియార్టీ ప్రకారం డీజీపీ కావాల్సిన ఆయన గత ప్రభుత్వంలో అనుసరించిన వైఖరి కారణంగా ప్రస్తుతం సస్పెన్షన్ కు గురయ్యేరు. అంతేకాకుండా ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జెత్వాని కేసులో తాజాగా అరెస్టు అయ్యారు. దీంతో ఎందరినో అరెస్టు చేయించి జైలుకు పంపిన సీనియర్ ఐపీఎస్ కూడా జైలుకు వెళ్లడం కర్మ ఫలమేనన్న టాక్ వినిపిస్తోంది.

పీఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఆయన పేరు వింటేనే అంతా హడలిపోయేవారు. ఎక్కువగా అప్పటి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే తిష్టవేసి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా ప్రణాళికలు రచించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఆయనను విధుల నుంచి తప్పించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో పీఎస్ఆర్ ఆంజనేయులు కలుస్తామన్నా సీఎం చంద్రబాబు సమయం ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగతంగా ఎవరిపై ద్వేషం చూపని ముఖ్యమంత్రి చంద్రబాబు.. పీఎస్ఆర్ ఆంజనేయులు విషయంలో చాలా కోపంగా ఉన్నారని అంటున్నారు. దీంతో ఆయన అరెస్టు వరకు పరిస్థితి దారితీసిందని అంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇలా ఓ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ముంబైకి చెందిన ఓ పారిశ్రామిక వేత్తకు అనుచిత లబ్ధి కోసం సినీ నటి కాదంబరిపై తప్పుడు కేసు నమోదు చేశారని పీఎస్ఆర్ ఆంజనేయులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పీఎస్ఆర్ తోపాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు అధికారులు సస్పెన్షన్ లో ఉండగా, పీఎస్ఆర్ ను తాజాగా అరెస్టు చేశారు. ఇదే కేసులో గతంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

పీఎస్ఆర్ అరెస్టుతో నటి కాదంబరి జెత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా హడలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఓ సీనియర్ ఐపీఎస్ నే అరెస్టు చేశారంటే మిగిలిన వారిని కూడా క్షమించే పరిస్థితి లేదని ప్రభుత్వం సంకేతాలు పంపిందని చర్చ జరుగుతోంది. నటి కాదంబరి జెత్వానీ కేసుతోపాటు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఎంపీగా ఉండగా, ఆయనపై కస్టోడియల్ టార్చర్ కేసులోనూ పీఎస్ఆర్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. రఘురామ ఫిర్యాదుపై పీఎస్ఆర్ ఆంజనేయులును నిందితుడిగా కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయనను ఆ కేసులోనూ అరెస్టు చేస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.