పీఎస్ఆర్ ఆంజనేయులు విలాసభవనం లెక్కనే వేరట!
ముంబయి నటి జెత్వానీ వేధింపులు.. అక్రమ అరెస్టు ఇష్యూకు సంబంధించిన వ్యవహారంలో తాజాగా ఏపీ క్యాడర్ కు చెందిన వివాదాస్పద ఐపీఎస్ కం ఏపీ నిఘా విభాగ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయటం తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 12:38 PM ISTముంబయి నటి జెత్వానీ వేధింపులు.. అక్రమ అరెస్టు ఇష్యూకు సంబంధించిన వ్యవహారంలో తాజాగా ఏపీ క్యాడర్ కు చెందిన వివాదాస్పద ఐపీఎస్ కం ఏపీ నిఘా విభాగ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయటం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఆయన్ను అదుపులోకి తీసుకోవటానికి ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ కు వచ్చారు. కారణం.. ఈ ఇష్యూ తెర మీదకు వచ్చిన తర్వాత నుంచి ఆయన తన మకాంను హైదరాబాద్ మహానగర శివారులోని ఒక విలాసవంతమైన విల్లాలోకి మార్చినట్లుగా చెబుతారు.
మొయినాబాద్ మండలం అమ్డాపూర్ రెవెన్యూ పరిధిలో 2.20 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన విల్లాలో ఆయన నివాసం ఉంటున్న విషయం తాజాగా వెలుగు చూసింది. ఆయన అరెస్టు వేళ.. ఆయన విల్లా.. దానికి సంబంధించిన పలు అంశాలు బయటకు వచ్చాయి. ఆరేళ్ల క్రితం సుమారు 2.20 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆంజనేయులు.. రిజిస్ట్రేషన్ మాత్రం తన కొడుకు ప్రద్యుమ్న్ పేరుతో చేసినట్లు చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ భారీ విల్లా నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. చివరకు పంచాయితీకి రుసుము కూడా చెల్లించకుండానే భవంతిని కట్టేసినట్లుగా గుర్తించారు. స్థానిక పంచాయితీ అధికారులు నిర్మాణ పనులు ఆపేందుకు వెళ్లగా.. తాను ఐపీఎస్ అధికారని పేర్కొంటూ బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆయనతో పెట్టుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వ్యవసాయ భూమిని కొన్న తర్వాత చుట్టూ ప్రహరీని నిర్మించిన ఆయన.. అనంతరం భవన నిర్మాణాన్నిచేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతరులు ఎవరూ లోపలకు వెళ్లకుండా భారీ పోలీసు బందోబస్తు ఉండేదని.. ఈ విల్లా కాపలాకు ఏపీ పోలీసుల్ని పెద్ద ఎత్తున వినియోగించినట్లుగా తెలుస్తోంది. తాజా అరెస్టు నేపథ్యంలో ఆయన విలాసవంతమైన విల్లా ఫోటోలు బయటకు రావటం.. అవి కాస్తా వైరల్ గా మారాయి.
