Begin typing your search above and press return to search.

లడఖ్‌ లో వేలాది మంది నిరసన.. అసలు ఏం జరుగుతోంది?

కాగా లడఖ్‌ లో తాజాగా వేలాది మంది భారతీయులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Feb 2024 7:32 AM GMT
లడఖ్‌ లో వేలాది మంది నిరసన.. అసలు ఏం జరుగుతోంది?
X

జమ్ముకాశ్మీర్‌ లో అంతర్భాగంగా ఉన్న లడఖ్‌ ను ప్రత్యేకంగా వేరు చేసి దాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. కశ్మీర్, లడఖ్‌ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. దీంతో లడఖ్‌ తమ ప్రాంతమని పాకిస్థాన్, తమదని చైనా మనదేశంతో వాదులాడుతున్నాయి. గతంలో చైనాతో జరిగిన గల్వాన్‌ ఘర్షణ లడఖ్‌ సమీపంలోనే జరిగింది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారు.

ఈ నేపథ్యంలో లడఖ్‌ లో భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. జాతీయ రహదారులను రాష్ట్ర రహదారులతో అనుసంధానించడం, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ క్యాంపులు, ఆయుధాలు, సరుకుల్ని త్వరగా చేర్చగల ఏర్పాట్లు, యుద్ధ విమానాలు దిగగలిగేలా రన్‌ వేలను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది.

కాగా లడఖ్‌ లో తాజాగా వేలాది మంది భారతీయులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రక్తాన్ని గడ్డ కట్టించే చలి ఉన్నా లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆదివారం కూడా భారీ ఎత్తున నిరసనకారులు తమ నిరసన తెలిపారు. ఈ నిరసనలతో లడఖ్‌ మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. లడఖ్‌ లో నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

లేహ్‌ అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (సీడీఏ) ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. నిరసనకారులకు సామాజిక కార్యకర్త, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్‌ వాంగ్‌ చుక్‌ మద్దతు ఇస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా లడఖ్‌ కు రాష్ట్ర హోదాతో పాటు భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ ప్రకారం రాజ్యాంగ రక్షణ కల్పించాలని లడఖ్‌ ప్రజలు కోరుతున్నారు. దీనికోసమే నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. లడఖ్‌ కు రాష్ట్ర హోదా కేటాయించడంతోపాటు లేహ్, కార్గిల్‌ జిల్లాలకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలను కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో లడఖ్‌ ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నిరసనలు తెలుపుతున్నవారితో చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకుండా ఆందోళనలు కొనసాగిస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది.

వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక విడత నిరసనలు చేస్తున్న సంస్థలతో చర్చలు జరిపింది. రెండో విడత చర్చలను ఫిబ్రవరి 19న నిర్వహించాల్సి ఉంది. అయినా.. ప్రజలు నిరసనలకు దిగడం హాట్‌ టాపిక్‌ గా మారింది. కేంద్రపాలిత హోదా వల్ల లేహ్, కార్గిల్‌ ప్రజలు రాజకీయంగా తమ అధికారాలు బలహీనమయ్యాయని భావిస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనేది వారి ఆందోళన. ఈ నేపథ్యంలో కేంద్రపాలిత హోదా ఎత్తేసి రాష్ట్ర హోదా కల్పించాలని నిరసనలు తెలుపుతున్నారు.