Begin typing your search above and press return to search.

జులైలో జపాన్ లో అంత దారుణం జరగనుందా? చెప్పిందెవరంటే?

భవిష్యత్తును ముందే అంచనా వేసి హెచ్చరించే వారు కొందరు ఉంటారు. తెలుగు నేల మీద పోతులూరి వీరబ్రహ్మంగారు.

By:  Tupaki Desk   |   20 April 2025 10:23 AM IST
Prophetic Vanga Artist Warns of Massive July Tsunami
X

భవిష్యత్తును ముందే అంచనా వేసి హెచ్చరించే వారు కొందరు ఉంటారు. తెలుగు నేల మీద పోతులూరి వీరబ్రహ్మంగారు. ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉంటారు. కంటి చూపు లేని బాబా వంగా రాసిన పలు అంచనాలు నిజం కావటం తెలిసిందే. ఆమెను పోలిన రీతిలోనే జపాన్ కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా ఈ జులైలోనే జరుగుతుందన్న అంచనా పలువురిని భయాందోళనలకు గురి చేస్తోంది. 2011 లోని భారీ సునామీతో జపాన్ చిగురుటాకులా వణికిపోవటమే కాదు.. సదరు సునామీ కారణంగా వేలాది మంది (సుమారు 20 వేలకు మరణించటం తెలిసిందే.

2011నాటి సునామీకి మించిన మూడు నాలుగు రెట్ల తీవ్రతతో విరుచుకుపడే సునామీ ఈ జులైలో జరుగుతుందన్నది ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం. గతంలో ఆమె చెప్పిన ఎన్నో అంచనాలు నిజం కావటంతో.. మరో మూడు నెలల తర్వాత జరుగుతుందన్న అంచనా ఇప్పుడు వణుకుపుట్టేలా చేస్తోంది. ఈ సునామీ తీవ్రత జపాన్ చరిత్రలోనే దారుణమైన విపత్తు విరుచుకుపడుతుందని హెచ్చరిస్తున్నారు.

1980 నుంచి ఆమె భవిష్యత్తు చెప్పటం ఒక ఎత్తు అయితే.. అలా ఆమె చెప్పిన అంచనాలు ఎన్నో నిజం అయ్యాయి. అదే ఇప్పుడు ఆందోళనకు మూల కారణంగా చెప్పాలి. గతంలో ఆమె ప్రిన్సెస్ డయానా మరణాన్ని ముందే చెప్పటం.. 2020లో విరుచుకుపడిన కరోనా గురించి హెచ్చరించటం లాంటివి చేశారు. ‘‘ద ఫ్యూచర్ దట్ ఐ సా’’ పేరుతో ఆమె ఒక పుస్తకాన్ని రాశారు. అంతేకాదు.. 1999లో ఆమె రాసిన మాంగా సైతం పెను దుమారానికి కారణమైంది.

రాకాసి బుడగలు పడగలెత్తుతాయని.. దక్షిణ జపాన సముద్రం మరిగిపోతుందని సునామీ తీవ్రతను ఆమె చెప్పుకుచ్చారు. ఈ సునామీ ధాటికి జపాన్.. తైవాన్.. ఇండొనేషియా.. ఉత్తర మారియానా దీవులు ఈ రాకాసి సునామీకి అతలాకుతలం అవుతాయని చెబుతున్నారు. దీంతో.. ఇదో హాట్ టాపిక్ గా మారింది. విపత్తుల అంశంలో శాస్త్రసాంకేతిక సాయం తీసుకోవాలే తప్పించి.. ఇలాంటి అంశాలలో మూఢనమ్మకాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టటం మంచిదికాదన్న హెచ్చరిక చేస్తున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తానుచెప్పిన జోస్యం మీద ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్నా.. ఆమె తన మౌనాన్ని వీడటం లేదు. జులైలో చోటు చేసుకునే సునామీ తీవ్రత ఎంతన్నది ఒక ఎత్తుఅయిత.. మరో ఐదేళ్లకు అంటే 2030లో కరోనాకు మించిన మరో విపత్తు విరుచుకుపడుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే.. దీనికి ముందు జులైలో విరుచుకుపడే సునామీ తర్వాత.. మిగిలిన అంశాల గురించి ఆలోచించొచ్చన్న మాట వినిపిస్తోంది.