Begin typing your search above and press return to search.

‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం

అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాదిన్నర చిన్నారి పునర్విక చికిత్సకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ అవసరమని తెలిసినప్పుడు తాను విస్తుపోయానని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

By:  Tupaki Political Desk   |   20 April 2026 3:22 PM IST
‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
X

అరుదైన వ్యాధులపై చికిత్స విషయంలో మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాంతక జన్యు సంబంధ వ్యాధులతో బాధపడుతున్న పునర్విక లాంటి చిన్నారులకు ఆసరాగా నిలిచేందుకు ‘ప్రాజెక్టు పునర్విక’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. బాధిత చిన్నారులకు చికిత్స ఖర్చును తగ్గించడం, వ్యాధులకు ఔషధాలు దేశీయంగా తయారయ్యేలా చూడటం, బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు ఓ వ్యవస్థను నిర్మించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలని మంత్రి వెల్లడించారు. ఇందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. అంతర్జాతీయ ఔషధ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, దేశీయ ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు జరిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.

అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాదిన్నర చిన్నారి పునర్విక చికిత్సకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ అవసరమని తెలిసినప్పుడు తాను విస్తుపోయానని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ‘‘ఆ చిన్నారికి ఎలా సాయం చేయగలనని ఆలోచించాను. నా సహాయం కేవలం ఒక బిడ్డకే పరిమితం కాకూడదని భావించాను. చికిత్సలు అందుబాటులో ఉన్నా.. అందుకు రూ.కోట్లు ఖర్చువుతుందని తెలిసి ఆశ్చర్యపోయాను. అప్పుడే ఇలాంటివారిని ఆదుకోవడానికి ఒక ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచన వచ్చింది అదే ప్రాజెక్ట్ పునర్విక’’ అని నారా లోకేశ్‌ ప్రకటించారు.

పునర్వికకు ఇంజెక్షన్‌ ఇస్తున్నప్పుడు కలిగిన భావోద్వేగాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఆ చిరుప్రాణాన్ని కాపాడేందుకు జరిగిన పోరాటం నన్ను కదిలించిందని మంత్రి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. చిన్నారి పునర్విక అదృష్టవంతురాలని, కానీ మిగతా వారి పరిస్థితేంటి? అన్న సంఘర్షణ తనకు ఆలోచనకు గురిచేసిందని అందుకే ప్రాజెక్టు పునర్విక పేరుతో ఒక అడుగు ముందుకు వేస్తున్నామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి చిన్నారికి సమానంగా చికిత్స అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్విక అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ వ్యాధితో బాధపడగా, సోషల్ మీడియా ప్రచారంతో దాదాపు రూ.16 కోట్లు విరాళంగా సేకరించిన విషయం తెలిసిందే. ఇందులో రూ.6 కోట్లు మంత్రి నారా లోకేశ్ వ్యక్తిగతంగా సమకూర్చారు. అంతేకాకుండా అమెరికా నుంచి ఇంజక్షన్ తెప్పించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడంతోపాటు కేంద్రంతో మాట్లాడి జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ వంటి దిగుమతి సుంకాలను మాఫీ చేయించారు. దీంతో చిన్నారి పునర్వికకు సకాలంలో వైద్యం జరిగి ప్రాణపాయం తప్పిందని అంటున్నారు.

ఇక చిన్నారి పునర్విక దీనగాథను సోషల్ మీడియా వెలుగుతెచ్చినట్లే ఆ తర్వాత కొందరు చిన్నారులు కూడా అరుదైన వ్యాధులు బారిన ప్రాణాపాయం ఎదుర్కొంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరు కూడా సహాయం కోసం ఎదురుచూస్తుండటంతో మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి అండగా నిలిచే వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి బాధిత బాలిక పునర్విక పేరును పెడుతూ ‘ప్రాజెక్టు పునర్విక’ చేపట్టడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.