Begin typing your search above and press return to search.

అమరావతికి ప్రియాంకాగాంధీ...గేర్ మార్చిన కాంగ్రెస్...!

ఏపీ కాంగ్రెస్ గేర్ మార్చింది. జోరు పెంచుతోంది. తెలంగాణాను చూసి ఏపీ కాంగ్రెస్ లో కూడా కదలిక వచ్చింది

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:56 PM GMT
అమరావతికి ప్రియాంకాగాంధీ...గేర్ మార్చిన కాంగ్రెస్...!
X

ఏపీ కాంగ్రెస్ గేర్ మార్చింది. జోరు పెంచుతోంది. తెలంగాణాను చూసి ఏపీ కాంగ్రెస్ లో కూడా కదలిక వచ్చింది. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఈ విషయంలో కాస్తా ముందున్నారు. ఆయన కాంగ్రెస్ అగ్ర నేత్రి ప్రియాంకా గాంధీని ఏపీకి రప్పించాలని చూస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీని రప్పించాలని ఆయన భావిస్తున్నారు.

నిజం చెప్పాలంటే రాహుల్ ప్రియాంక ఏపీ టూర్లు చాలా నెలల క్రితమే నిర్ణయించబడ్డాయి. కానీ అవి అంతకంతకు ఏదో కారణం వల్ల ఆలస్యం అవుతున్నాయి. ఇపుడు తెలంగాణా ఎన్నికల హడావుడిలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాహుల్ ప్రియాంక క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ కి అధికారం పక్కా అని కూడా వారు భావిస్తున్నారు. ఇక తెలంగాణా తరువాత ఏపీ మీదనే కాంగ్రెస్ పెద్దల ఫోకస్ ఉంటుంది అని అంటున్నారు. డిసెంబర్ 3న తెలంగాణా ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఈ డిసెంబర్ రెండవ వారం నుంచే కాంగ్రెస్ హై కమాండ్ ఏపీ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టనుంది అని అంటున్నారు

అదే విధంగా చూస్తే ప్రియాంకా గాంధీని ముందుగా ఏపీకి రప్పించాలని చూస్తున్నారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ కూడా ఇతర విపక్షాలతో గొంతు కలిపింది. వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనను కాంగ్రెస్ తప్పుపడుతోంది. దాంతో పాటు అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని కూడా చెబుతోంది.

ఇక అమరావతిలోనే ప్రియాంకా గాంధీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని కూడా ఏపీ కాంగ్రెస్ ఆలోచిస్తోంది. తెలంగాణా ఎన్నికల తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ ఏపీలో పెంచాలన్న ఉద్దేశ్యంతో నిర్వహించే ఈ సభ మీద చాలా ఆశలనే అంతా పెట్టుకున్నారు.

దీంతో ప్రియాంకా గాంధీ చాలా తొందరలోనే ఏపీ టూర్ చేయనున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ప్రియాంకా గాంధీకి ఒక లేఖ రాశారు. ఉమ్మడి ఏపీని రెండుగా విభజిస్తూ కాంగ్రెస్ నాడు యూపీయే హయాంలో నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రయోజనాలను పరిరక్షించడానికి విభజన చట్టాన్ని కూడా రూపొందించింది.

అయితే ఈ చట్టాన్ని గత పదేళ్ళుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం అమలు చేయలేదని గిడుగు రుద్రరాజు ప్రియాంకాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఏపీని రెండు దఫాలుగా పాలించిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని కూడా ఆయన ఆరోపించారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాల్సింది కాంగ్రెస్ మాత్రమే అని ఆయన అంటున్నారు.

ఏపీకి ఈ రోజు దాకా రాజధాని లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని రుద్రరాజు అంటున్నారు. అందువల్ల పునర్ విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ఘంటాపధంతా కాంగ్రెస్ చెబుతూ ఆ విషయం మీద ఏపీ ప్రజలకు ఒక కీలక సందేశం ఇచ్చేలా అమరావతిలోనే భారీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది అని ఆయన వెల్లడించారు. ఆ సభకు ప్రియాంకా గాంధీ హాజరు కావాలని ఆయన కోరుతున్నారు.

మరి ప్రియాంకా గాంధీ ఈ లేఖ తరువాత తన నిర్ణయం చెబుతారు అని అంటున్నారు. ఈ మీదట ఒక డేట్ ప్లేస్ ఫిక్స్ చేసి మరీ ప్రియాంకా గాంధీ తో భారీ సభకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ చేస్తోంది. అమరావతి ఇష్యూతోనే ఏపీలో ఎంటర్ కావాలని కాంగ్రెస్ చూస్తోంది. అదే విధంగా రాహుల్ గాంధీని విశాఖ రప్పించి స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉధృతం చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఏది ఏమైనా డిసెంబర్ 3 తరువాత ఏపీ మీదనే కాంగ్రెస్ చూపు ఉంటుందని అంటున్నారు.