Begin typing your search above and press return to search.

తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే లేఖలకు ప్రయారిటీ.. త్వరలో ఓకే!

ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ తిరుమలకు ఉండే ప్రాధాన్యత లెక్కే వేరుగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:00 AM GMT
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే లేఖలకు ప్రయారిటీ.. త్వరలో ఓకే!
X

ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ తిరుమలకు ఉండే ప్రాధాన్యత లెక్కే వేరుగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయాల్లో అగ్రస్థానంలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తెలంగాణతో పాటు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి చోటు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఛైర్మన్ గా భూమాన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త పాలక మండలిని ఏర్పాటుచేయటం తెలిసిందే. ఇందులో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి (చేవెళ్ల) సతీమణి సీత ఎంపిక కావటం తెలిసిందే. నాలుగురోజుల క్రితం టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఏపీ విభజన జరిగిన నాటి నుంచి.. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు టీటీడీలో పెద్దగా ప్రాధాన్యత లభించటం లేదు. కొన్ని లేఖల్ని తప్పించి.. మిగిలిన వాటిని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. దీంతో.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తిరుమల కొండకు వస్తున్నప్పుడు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖుల్లో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వటం.. బోర్డు సభ్యులుగా వారి లేఖలకు ప్రాధాన్యత లభిస్తున్నా.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ లేఖల్నిపరిగణలోకి తీసుకోవటం లేదు.

దీంతో.. స్థానికుల నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి వస్తోంది. ఇలాంటి వేళ.. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన రంజిత్ రెడ్డి సతీమణి సీత.. ఈ అంశంపై ఫోకస్ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫార్సు లేఖలకు టీటీడీలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి టీటీడీ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. త్వరలోనే తీపికబురు అందుతుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆనందానికి హద్దులు ఉండవన్న మాట వినిపిస్తోంది.

కొసమెరుపు ఏమంటే.. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఏపీకి చెందిన ప్రజాప్రతినిదుల లేఖలకు ప్రత్యేకంగా చూస్తామని.. వారికి ప్రత్యేక వసతులు కల్పిస్తామన్న ప్రకటన మాత్రం తెలంగాణ ప్రభుత్వాధినేతల నుంచి రాకపోవటం గమనార్హం. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరే సమయంలోనే.. తెలంగాణలోని యాదాద్రి మొదలుకొని మరికొన్నిప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఏపీ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రయారిటీ ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రకటించొచ్చుకదా? అలా ఎందుకు జరగదంటారు?