Begin typing your search above and press return to search.

మోడీ అయిదేళ్ల ప్రధాని కారా ?

అదేంటి బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీయే కదా అని అందరూ నమ్ముతారు

By:  Tupaki Desk   |   19 May 2024 7:49 AM GMT
మోడీ అయిదేళ్ల ప్రధాని కారా ?
X

అదేంటి బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీయే కదా అని అందరూ నమ్ముతారు. అంతే కాదు మోడీ తప్ప మరొకరు ప్రధాని పీఠం మీద ఆయన పాలిస్తుండగా కూర్చునే సాహసం చేస్తారు అన్నది కూడా ప్రశ్నిస్తారు. కానీ రాజకీయాలు ఎపుడూ ఒక్కలా ఉండవు. అవి మారుతూ ఉంటాయి. ఇక బీజేపీ లాంటి సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించిన పార్టీలలో వారసులు ముందుగానే తయారు చేసుకుని రెడీగా ఉంటారు.

బీజేపీ వాజ్ పేయ్ ఎల్ కే అద్వానీలను ఒకే తరంలో నాయకులుగా తయారు చేసి ఉంచింది. అలాగే మురళీ మనోహర్ జోషీ లాంటి వారిని కూడా మరో వరసలో ఉంచింది. ఇక వెంకయ్యనాయుడు, రాజ్ నాధ్ సింగ్ నితిన్ గడ్కరీ వంటి వారు తరువాత తరంలో వచ్చారు. వీరితో పాటుగానే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా జాతీయ రాజకీయాల్లోకి సడెన్ గా వచ్చి ఇపుడు బీజేపీని శాసించే పరిస్థితిలో ఉన్నారు.

2014 నుంచి బీజేపీ రాజకీయం మారిపోయింది. బీజేపీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేవి రెండే పేర్లు ఒకటి మోడీ రెండు అమిత్ షా. మోడీ గ్లామర్ పార్టీకి ఆయువు పట్టు అయితే అమిత్ షా గ్రామర్ బీజేపీ వ్యూహాలకు పెట్టుబడిగా మారింది. ఈ ఇద్దరూ కలసి పదేళ్ళలో దేశ రాజకీయ గతిని మార్చేశారు. బీజేపీ వర్సెస్ నాన్ బీజేపీ ఫోర్సెస్ అన్నట్లుగా దేశంలోని రాజకీయాల్లో సరికొత్త విభజన చేశారు.

ఆ విధంగా చేయడం వల్ల పొలిటికల్ పోలరైజేషన్ జరిగి బీజేపీ గణనీయంగా లబ్ది పొందింది. బీజేపీని కోరుకున్న వారు ఆ వైపే ఉంటారు. కాదనుకునే శక్తులే చీలిపోతూ వస్తాయి. ఇది బీజేపీ అధికారంలోకి రెండు సార్లు రావడానికి కారణం అయింది. ముచ్చటగా మూడవసారి బీజేపీ అధికారం దక్కించుకునేందుకు పట్టుదలగా పనిచేస్తున్న వేళ బీజేపీ ఆయువు పట్టునే దెబ్బ కొట్టే విధంగా విపక్ష శిబిరం నుంచి అతి పెద్ద ప్రచారం స్టార్ట్ అయింది.

మోడీకి ఈసారి ఓటేస్తే అయిదేళ్ల పాటు ఆయన ప్రధానిగా ఉండరు అంటూ ఇండియా కూటమి నుంచి వస్తున్న ప్రచారం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ మూలాలనే దెబ్బ తీస్తోంది. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది అంటే మోడీ ఇమేజ్ తోనే అని అంతా అంటారు. మోడీని చూసే ఓట్లు రాలుతాయి.

అటువంటి మోడీయే అయిదేళ్ళ పాటు ప్రధానిగా ఉండరు అంటే ఓటేసే వారు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటారు. మోడీ గ్యారంటీలు పేరుతో చెబుతున్న వన్నీ ఆయన ప్రధానిగా లేకపోతే దక్కవేమో అన్న కలవరం కూడా రేగుతుంది. దాంతో మోడీ ప్రధానిగా ఉండరు అంటూ విపక్షం చేస్తున్న ప్రచారం మాత్రం కమల దళాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.

అదే సమయంలో మోడీ ఈ రోజు పడుతున్న కష్టం అంతా తన సహచరుడు అమిత్ షాని ప్రధానిని చేయడానికే అంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన విమర్శలు కూడా జనాలను ఆలోచనలో పడవేసేలా చేస్తున్నాయి. అమిత్ షా తెర వెనక వ్యక్తిగానే ఉంటారు తప్ప బీజేపీకి ఆయన గ్లామర్ కాదు అని విమర్శలు ఉన్నాయి.

మోడీ మీద ఎన్ని విమర్శలు ఉన్న ఆయనకు సంసార జంజాటాలు లేవని అవినీతి మరక లేదని సగటు జనం ఈ రోజుకీ భావిస్తారు. అందుకే మోడీని ఎక్కువగా ఇష్టపడతారు. అదే అమిత్ షా అయితే మోడీని పక్కన పెట్టుకుని చక్రం తిప్పుతారని కూడా ఒక ప్రచారంలో ఉన్న మాటగా ఉంది. జనాలూ అదే ఎక్కువగా నమ్ముతరు అని అంటారు.

ఇక మోడీకి ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఉంది. ఆయన పట్ల దేశ ప్రజలకు ఉన్న అభిమానంతో ప్రధాని పదవిని ఇచ్చారు. అమిత్ షా అంటే బీజేపీ ఓటు బ్యాంక్ లోనే తేడాలు వచ్చేస్తాయి అని అంటారు. బీజేపీలో చూస్తే మోడీ తరువాత ప్రజాకర్షణ శక్తి ఉన్న నాయకుడిగా యోగీ ఆదిత్యనాధ్ నే అంతా చూస్తారు. ఆయన రెండు సార్లు వరసగా యూపీ సీఎం గా ఉన్నారు.

బలమైన రాజ్ పుట్ వంశానికి చెందిన వారు. మోడీ లాగానే సంసార బంధనాలు లేని వారు. అవినీతి మరక అంతకంటే లేదు. మోడీ అయిదేళ్ల పాటు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆయన తరువాత యోగీకే పట్టం కడితే చూడాలని అనుకునే వారు బీజేపీతో పాటుగా ఆరెస్సెస్ లోనూ ఉన్నారు. దేశంలోనూ ఉన్నారు.

మరి మోడీ అయిదేళ్ల పాటు ప్రధానిగా ఉండరు, ఆయన మధ్యలోనే అమిత్ షాని ప్రధానిని చేసి దిగిపోతారు అని కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు జనాలలోకి బాగానే వెళ్తున్నాయి. వారే కనుక దీని మీద తీవ్రంగా మధనపడితే మాత్రం బీజేపీ ఓటు బ్యాంక్ కే చిల్లు పడుతుంది అని అంటున్నారు. అయితే దీని మీద ఇప్పటికే అమిత్ షా వివరణ ఇచ్చారు కానీ అది సరిపోవడం లేదు. రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలలో ఇది కూడా ఒకటి కావచ్చు అన్నది విశ్లేషకుల భావనగా ఉంది.