అంతా కాలిపోయాక.. వరాలు ఇస్తే లాభమేంటి మోడీ?
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా.. ఆయన ఎప్పుడు ఎలా రియాక్టు అవుతారన్న విషయంపై అందరికి అవగాహన ఉండనే ఉంటుంది.
By: Tupaki Desk | 1 Oct 2023 8:21 PM ISTదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా.. ఆయన ఎప్పుడు ఎలా రియాక్టు అవుతారన్న విషయంపై అందరికి అవగాహన ఉండనే ఉంటుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన తీరు.. ప్రత్యర్థుల విషయంలో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై పెద్దగా తెలీని వాళ్లు సైతం.. గడిచిన తొమ్మిదిన్నరేళ్లుగా దేశ ప్రధానిగా ఆయన తీరు దేశ ప్రజలకు సుపరిచితం. ఎప్పుడు ఎలా రియాక్టు అవుతారు? అధికారం కోసం ఏదైనా రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే ఏం చేస్తారు? ఎలా చేస్తారన్న విషయాలు అందరికి తెలిసినవే.
మరి.. అందరికి తెలిసిన విషయాల్ని ఎవరికీ తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్న మోడీ తీరు ఇప్పుడు చర్చగా మారింది. తెలంగాణలో బీజేపీ జోరు పెరిగి.. ఈసారి ఎన్నికల్లో సంచలనాలు చోటు చేసుకుంటాయన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వ విషయంలో మోడీషాలు తీసుకున్న నిర్ణయాలతో పాటు.. అధికార బీఆర్ఎస్ పై సాగించే పోరు విషయంలోనూ వారి తీరు రోటీన్ కు భిన్నంగా ఉండటం తెలిసిందే.
బీజేపీ - బీఆర్ఎస్ మధ్య తెర వెనుక డీల్ కుదిరిందన్న ప్రచారం భారీగా సాగటమే కాదు.. సొంత పార్టీ నేతలు సైతం సందేహాలు వ్యక్తం చేసే వరకు విషయం వెళ్లటం తెలిసిందే. దీంతో.. సామాన్యులు సైతం బీజేపీని నమ్మని పరిస్థితి తెలంగాణలో ప్రస్తుతం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం దక్కకుండా ఉండేందుకు కేసీఆర్ తో తెర వెనుక ఒప్పందం జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ మధ్య వరకు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించి.. కాంగ్రెస్ చేతికి పవర్ రాకూడదన్న ఏకైక ఎజెండాతో బీఆర్ఎస్.. బీజేపీలు వ్యూహరచన చేస్తున్నాయన్న అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా గడపగడపకు వెళ్లిపోవటంతో.. బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉన్నా.. బీజేపీ గ్రాఫ్ మాత్రం దారుణంగా దెబ్బ తిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడుతుందన్న వేళలో.. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటన చేపట్టటం ఆసక్తికరంగా మారింది. తాజాగా మహబూబన్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన బోలెడన్ని వరాల్ని ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని ఐదేళ్లుగా నెరవేర్చని కేంద్రం..తాజాగా తెలంగాణకు వరంగా ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో పసుపు బోర్డుతో పాటు.. మహబూబ్ నగర్ లో జాతీయ రహదారులు.. రైల్వే తదితర శాఖలకు సంబంధించిన డెవలప్ మెంట్ పనులకు సంబంధించిన వరాల్ని ప్రకటించారు.అంతేకాదు.. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించిన మోడీ.. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క - సారక్క ట్రైబర్ వర్సిటీ పేరుతో ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణలో రూ.13500 కోట్లతో డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పిన ప్రదాని.. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టినట్లుగా చెప్పారు. తాజాగా చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర.. తెలంగాణ.. ఏపీ మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. ఇదంతా చూస్తే.. మొత్తం కాలి బూడిదైన తర్వాత ఇన్ని వరాలు కురిపిస్తే మాత్రం ఏమైనా లాభం ఉంటుందా మోడీ? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.
