Begin typing your search above and press return to search.

మోడీకి కేసీఆర్ తో ఎక్కువ డ్యామేజ్ జరిగిందా? బాబుతోనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించే కొన్ని వాదనల్ని దేనికి అదే చూసినప్పుడు నిజమే అన్నట్లు అనిపిస్తాయి.

By:  Tupaki Desk   |   1 Oct 2023 2:30 PM GMT
మోడీకి కేసీఆర్ తో ఎక్కువ డ్యామేజ్ జరిగిందా? బాబుతోనా?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించే కొన్ని వాదనల్ని దేనికి అదే చూసినప్పుడు నిజమే అన్నట్లు అనిపిస్తాయి. అలాంటి కొన్ని వాదనలకు శీలపరీక్ష చేసినప్పుడు.. అందులోని డొల్లతనం బయటకు రావటమే కాదు.. కనిపించని మరెన్నో అంశాలు కూడా ఉన్నట్లుగా అర్థమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అంశాల్ని చూస్తే.. ఒకదానికి మరొకటి మ్యాచ్ కాని వైనం కనిపిస్తుంటుంది. ఉదాహరణకు తనను ఏదైనా విమర్శ చేసిన వారిని మోడీ గుర్తుకు పెట్టుకుంటారని.. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ వాటిని మర్చిపోరన్న వాదన ఒకటి బలంగా వినిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా తనను డ్యామేజ్ చేసే వారి విషయంలో మోడీ తీసుకునే రివేంజ్ ఒక రేంజ్ లో ఉంటుందన్న బిల్డప్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

ఆ వాదనలో నిజం ఎంత? అన్నది చూస్తే.. ప్రచారంలో కనిపించినంత ఏమీ చేతల్లో కనిపించదు. ఎక్కడో..తెలుగు రాష్ట్రాలకు దూరంగా మరెక్కడో జరిగిన విషయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. తెలుగువారికి బాగా అర్థమయ్యే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్నే తీసుకొని.. మోడీ స్పందించే తీరును చూస్తే.. విచిత్రమైన అంశాలు వెలుగు చూస్తాయి. అప్పుడెప్పుడో జమానాలో.. గోద్రా అల్లర్లు జరిగినవేళలో.. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన విమర్శలు.. ఆయన్ను తెగ ఇబ్బంది పెట్టాయని.. అందుకే ఆయనపై బదులు తీర్చుకునేందుకు మోడీ తెగ ఇంట్రస్టు చూపిస్తారని.. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టరన్న ప్రచారం జోరుగా సాగటం తెలిసిందే.

ఇందులో అంతో ఇంతో నిజం ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజంగానే.. ప్రధాని మోడీకి బదులు తీర్చుకోవటంలో అంత కచ్ఛితంగా ఉంటారా? అన్నది చూస్తే.. నిజం కాదనిపిస్తుంది. ఎందుకుంటే.. 2014 ఎన్నికల సమయంలో యావత్ దేశంలోమోడీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేసిన అధినేతలు లేరనే చెప్పాలి. ఇలాంటి వేళ.. తెలంగాణ సాధించి మాంచి ఊపులో ఉన్న అప్పటి టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నోటి నుంచి మోడీ ఒక రక్త పిపాసి అన్న తీవ్రమైన వ్యాఖ్యతో పాటు.. మరెన్నో కఠినమైన వ్యాఖ్యల్ని చేశారు. ఘాటు విమర్శల్ని చేశారు.

ఒకవిధంగా చూస్తే.. మోడీని నోరెత్తి మాట అనేందుకు సాహసించని రోజుల్లో ఒక రేంజ్ లో కేసీఆర్ ఫైర్ అయ్యారు. తనను అనేవారిని ఒక పట్టాన మోడీ వదిలి పెట్టరన్నదే నిజమైతే.. కేసీఆర్ మీద గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో ఎలాంటి రివేంజ్ తీర్చుకున్నారు? అన్నది ప్రశ్న. అదొక్కటే కాదు.. దేశంలో మరే రాష్ట్ర మంత్రి చేయని రీతిలో.. ప్రధానమంత్రి మోడీపై డైలీ బేసిస్ లో విమర్శలతో ఉతికి ఆరేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై ఇప్పటికే ఏదో ఒక రకంగా బదులు తీర్చుకోవాలి కదా?

ప్రధాని మోడీపై ఏదో మాట వరసకు అన్నట్లుగా కేటీఆర్ విమర్శలు చేసింది లేదు. రాష్ట్రస్థాయి వేదికల మీదనే కాదు జాతీయ స్థాయి వేదికల మీద కూడా మోడీని విమర్శలతో టార్గెట్ చేయటం కనిపిస్తుంది. అంతేనా.. ప్రధాని హోదాలో మోడీ తెలంగాణకు వస్తే.. ఆయనకు స్వాగతం పలికేందుకు ససేమిరా అన్న కేసీఆర్ (ఒకట్రెండు సార్లు కూడా కాదు) తన మంత్రివర్గంలోని మంత్రిని పంపటం ద్వారా ఎలా వ్యవహరించారో తెలిసిందే. బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలకు హైదరాబాద్ ను వేదికగా చేసిన వేళ.. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎదురైన అనుభవాలు.. హైదరాబాద్ మహానగరంలో మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పదే పదే వెలిసే పోస్టర్లతో జరిగిన డ్యామేజ్ చాలానే అన్న మాట వినిపిస్తోంది.

అప్పుడెప్పుడో చంద్రబాబు నోటి నుంచి వచ్చిన నాలుగు మాటలు.. ఆ తర్వాతి కాలంలో చేసిన విమర్శలు పరిమితమే తప్పించి.. కేసీఆర్ సర్కారు చేసినంత భారీగా చేసింది లేదు. 2019 ఎన్నికల ప్రచార సందర్భంలో చంద్రబాబు విరుచుకుపడిన మాట వాస్తవమే అయినా.. కేసీఆర్ సర్కారు చేసిన ఇమేజ్ డ్యామేజ్ తో పోలిస్తే తక్కువనే చెప్పాలి. అలాంటప్పుడు.. చంద్రబాబు మీద ప్రతీకారానికి కసిగా ఉండే మోడీ.. కేసీఆర్ అండ్ కో మీద మరెంత కసిగా ఉండాలి? అందునా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తెకు లింకులు ఉన్నాయని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన వేళ వదలకూడదు కదా? కానీ.. ఆ అవకాశాన్ని మోడీ సర్కారు సద్వినియోగం ఎందుకు చేసుకోలేకపోయింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు చంద్రబాబును అదే పనిగా టార్గెట్ చేయటమే కనిపిస్తుందన్న అభిప్రాయాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తుంటారు. ఏమైనా.. చంద్రబాబు మీద రివేంజ్ తీర్చుకునే విషయంలో మోడీ దూకుడు.. కేసీఆర్ విషయానికి వస్తే సరికి ఎందుకంత ఎక్కువగా ఉండదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.