Begin typing your search above and press return to search.

షర్మిల అరెస్టు మీద రియాక్టు అయిన మోడీ ఇప్పుడెందుకు మౌనం?

స్కిల్ స్కాం ఆరోపణలతో ఏపీ విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్న వేళ.. రోజుకో వాదన తెర మీదకు వస్తోంది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 3:30 PM GMT
షర్మిల అరెస్టు మీద రియాక్టు అయిన మోడీ ఇప్పుడెందుకు మౌనం?
X

స్కిల్ స్కాం ఆరోపణలతో ఏపీ విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్న వేళ.. రోజుకో వాదన తెర మీదకు వస్తోంది. తాజాగా.. వేలు ప్రధానమంత్రి మోడీ వైపునకు వెళ్లింది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినట్లుగా గొప్పలు చెప్పుకున్న దానికి భిన్నంగా.. చంద్రబాబు అరెస్టు వేళ.. వెలువడిన స్పందనలు చూస్తే ఆచితూచి అన్నట్లుగా ఉన్నాయే తప్పించి.. ఎక్కువగా ఉన్నది లేదు. కొందరు నేతలు మాత్రమే అరెస్టు అంశంపై స్పందించారు.

బీజేపీ విషయానికి వస్తే నితిన్ గడ్కరీ మినహాయిస్తే మిగిలిన వారు రియాక్టు అయ్యింది లేదు. ఈ మౌనంపై తెలుగుదేశం నేతలు.. అభిమానులు.. సానుభూతిపరుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆగ్రహావేశాల్ని వ్యక్తమయ్యేలా చేస్తోంది. అదే సమయంలో కొత్త సందేహాల్ని తీసుకొచ్చేలా చేస్తోంది. చంద్రబాబు అరెస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు స్పందించకపోవటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

ఈ సందర్భంగా కొత్త వాదన ఒకటి ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది. ఆ మధ్యన షర్మిలను అరెస్టు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పు పట్టేలా.. ప్రధాని మోడీ పలుకరింపులు ఉన్న వేళ.. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను డెబ్భై మూడేళ్ల వయసులో అరెస్టు చేయటాన్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది కదా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. అలాంటిదేమీ లేకుండా.. అరెస్టు అయిన రెండు వారాలు గడిచిపోయి.. మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మౌనంగా ఉండటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

మోడీ మౌనం చూస్తుంటే.. చంద్రబాబు అరెస్టుకు ఆయన ఆమోదం కూడా ఉన్నట్లు కనిపిస్తోందన్న మాటను తెలుగుదేశం అభిమానులు పలువురు పదే పదే ప్రస్తావిస్తున్నారు. సీఐడీ చేస్తున్న ఆరోపణల్లో పెద్దగా పస లేదని.. న్యాయస్థానాల్లో ఈ ఆరోపణలు అస్సలు నిలవడవని.. విచారణలో తేలిపోతాయని.. రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుపై మోడీ లాంటి ప్రధాని సైతం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే.. చంద్రబాబు అరెస్టు వెనుక మోడీ ఆమోదముద్ర పడిందా? అన్న సందేహాల్ని తెర మీదకు తెస్తున్నారు. ఇందుకు షర్మిల అరెస్టు వేళ.. నమో నుంచి వచ్చిన రియాక్షన్ కు.. తాజా స్పందనకు మధ్యనున్న తేడాను ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. మరి.. బాబు అరెస్టుపై మోడీ ఎప్పుడు మాట్లాడతారో చూడాలి.