Begin typing your search above and press return to search.

ప్రధాని హిందువు కాదు.. తల్లి చనిపోతే గుండు కూడా కొట్టించుకోలేదు!

ప్రధాని హిందువు కాదని, ఆయన తల్లి మరణిస్తే గుండు కొట్టించుకోలేదని గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   4 March 2024 7:29 AM GMT
ప్రధాని హిందువు కాదు.. తల్లి చనిపోతే గుండు కూడా కొట్టించుకోలేదు!
X

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రధాని హిందువు కాదని, ఆయన తల్లి మరణిస్తే గుండు కొట్టించుకోలేదని గుర్తు చేశారు.

కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోదీ దాడికి పాల్పడుతున్నారని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మండిపడ్డారు. ప్రధానికి కుటుంబమే లేదని ఎద్దేవా చేశారు. తల్లి మరణిస్తే హిందువులెవరైనా గుండు చేయించుకుంటారని గుర్తు చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం గుండు చేయించుకోలేదన్నారు. ప్రధాని మోదీ హిందువు కాదు కాబట్టే గుండు చేయించుకోలేదన్నారు.

నరేంద్ర మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని లాలూప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని మోదీ.. కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి ఎందుకు పిల్లలు లేరు?.. ఎందుకు ఫ్యామిలీ లేదు?.. ఎందుకంటే ఆయన హిందువు కాదు కాబట్టి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా విద్వేషాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు.

బీహార్‌ రాజధాని పాట్నాలో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌ఎల్డీ) ఆధ్వర్యంలో

‘జన్‌ విశ్వాస్‌ ర్యాలీ’ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలు.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి.

బీజేపీ నాయకులంతా అబద్ధాలకోరులని, వారు అందర్నీ మోసం చేస్తున్నారని బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ మండిపడ్డారు. ప్రధాని మోదీ బీహార్‌ కు వచ్చి తన తండ్రిని విమర్శించి వెళ్లారన్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన పనుల్ని మీరెందుకు గొప్పగా చెప్పుకోవడం లేదని తనను మోదీ పరోక్షంగా ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

లాలూ బీహార్‌ ముఖ్యమంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పలు చారిత్రత్మక పనులు చేశారని తేజస్వీ యాదవ్‌ గుర్తు చేశారు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం తీసుకువచ్చారని చెప్పారు.

కాగా మార్చి 1 పాట్నాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే వనరులు ఎలా దోచుకున్నారో, ఉద్యోగ అవకాశాలు ఎలా దోచుకున్నారో బీహార్‌ ప్రజలందరికీ తెలుసంటూ ప్రధాని మోదీ మండిపడ్డారు.