Begin typing your search above and press return to search.

నీటిలో దాగున్న మృత్యువు.. ఇప్పటికి ఎంత మందిని బలితీసుకుందంటే.. కేరళలో కలకలం..

మనిషి ఎన్నో రోగాలను జయిస్తూ మృత్యుంజయుడిగా నిలిచేందుకు తపనపడుతున్నాడు.

By:  Tupaki Desk   |   18 Sept 2025 3:36 PM IST
నీటిలో దాగున్న మృత్యువు.. ఇప్పటికి ఎంత మందిని బలితీసుకుందంటే.. కేరళలో కలకలం..
X

మనిషి ఎన్నో రోగాలను జయిస్తూ మృత్యుంజయుడిగా నిలిచేందుకు తపనపడుతున్నాడు. కానీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. మృత్యువుకు కారణమయ్యే సూక్ష్మజీవులపై మనిషి నిత్యం పోరాడుతున్నా.. అవి మనిషిపై పైచేయి సాధిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు కలరా వ్యాపించి కోట్లాది మంది మరణించారు. మొన్నటికి మొన్న కొవిడ్ వచ్చి ఎంత మంది చనిపోయారో చెప్పక్కర్లేదు. ఇంత తీవ్రత కాకున్నా.. కేరళలో వ్యాపిస్తున్న ఒక వ్యాధితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మనిషి కళ్లకు కనిపించని జీవుల శక్తి ఎంత భయంకంగా ఉంటుందో కేరళలో జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుసుకోవచ్చు. ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలిటిస్‌ (PAM) అనే అరుదైన వ్యాధి, ‘మెదడు తినే అమీబా’గా వ్యాపిస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 61 కేసులు నమోదయ్యాయి. 19 మంది ఇందులో ప్రాణాలు కోల్పోయారు. శిశువుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది వ్యాపిస్తుంది.

నీటిలో శత్రువు

ఈ అమీబా బావులు, చెరువులు, ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది. ప్రజలు ఈ నీటితో స్నానం చేయడం, ఈత కొట్టడం, పిల్లలు ఆడుకోవడం వంటివి చేస్తే నీరు ముక్కు ద్వారా లోపలికి వెళ్లి వ్యాధి ప్రారంభం అవుతుంది. ఒకసారి శరీరంలోకి చేరాక అది నేరుగా మెదడును చేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నీటిని తాగడం ద్వారా మాత్రం పామ్ వ్యాధి సోకదు.

లక్షణాలు – భయంకర గమ్యం

మొదట ఇది సాధారణ జలుబులాగా అనిపిస్తుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు కనిపిస్తాయి. కొన్ని రోజుల్లోనే పరిస్థితి భయంకరంగా మారుతుంది. మెదడు వాపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, కోమా వరకు వెళ్లి చివరికి మరణం కూడా సంభవిస్తుంది. లక్షణాలు బయటపడిన 24 నుంచి 48 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి నుంచి బయటపడ్డ వారు చాలా అరుదుగా ఉన్నారని చెప్పవచ్చు.

చికిత్సలో సవాళ్లు

పామ్ వ్యాధికి మందులు ఉన్నప్పటికీ రక్తం నుంచి మెదడులోకి చేరడం కష్టం. అంతే కాకుండా రోగిని త్వరగా గుర్తించడం అసాధ్యం. మొదటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. కేరళలో ఇప్పటి వరకూ మరణాలు ఎక్కువగా జరగడానికి ఇదే ప్రధాన కారణం. త్వరితగతిన వైద్య పరీక్షలు చేయకపోతే మరణం వరకు దారి తీస్తుంది.

ప్రభుత్వం ఏం చేస్తుందంటే?

పామ్ పై వేగంగా స్పందించిన కేరళ ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ సహకారంతో నీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తోంది. చెరువులు, బావులు, నిల్వ నీటిలో ఈత కొట్టవద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒక వేళ జలావాసాల్లోకి తప్పనిసరిగా వెళ్లాలనుకునే వారు నోస్ క్లిప్స్ వాడమని సూచనలు చేస్తోంది. బావులు, ట్యాంకులు శుభ్రం చేసి క్లోరిన్ వేయమని ఆదేశాలు జారీ అయ్యాయి.

పెరుగుతున్న భయం

2016 నుంచి 2022 వరకు కేరళలో ఈ వ్యాధికి సంబంధించి కేవలం 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ 2023లో ఒక్కసారిగా 36 కేసులు, 9 మరణాలు సంభవించాయి. దీంతో ఆందోళన మొదలైంది. ఈ సంవత్సరం ఆ సంఖ్య 61 కేసులు, 19 మరణాలు దాటడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. వాతావరణ మార్పులు, నీటి ఉష్ణోగ్రత పెరగడం, గ్లోబల్ వార్మింగ్ ఈ వ్యాధి మరింత విస్తరించేందుకు దోహదం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.