Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి సంధించిన లేఖతో రాజ్యాంగ ధర్మ సంకటం

రాష్ట్రపతి అంటే రాజ్యాంగం ప్రకారం సర్వస్వం. రాష్ట్రపతి కదిలే రాజ్యాంగంగా చూడాలి.

By:  Tupaki Desk   |   17 May 2025 8:55 AM IST
రాష్ట్రపతి సంధించిన లేఖతో రాజ్యాంగ ధర్మ సంకటం
X

రాష్ట్రపతి అంటే రాజ్యాంగం ప్రకారం సర్వస్వం. రాష్ట్రపతి కదిలే రాజ్యాంగంగా చూడాలి. ఈ దేశంలో ఏ ఉత్తర్వు అయినా రాష్ట్రపతి సంతకం తోనే వెలువడుతుంది. అలా పాలన అంతా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. అయితే రాష్ట్రపతిని కూడా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు.

కానీ ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే ఎంతటి ఉన్నత పదవులలో ఉన్న వారిని అయినా అభిశంశించి గద్దె దించే అధికారం పార్లమెంట్ కి ఉంది. దానిని ఆమోదించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఇలా చూస్తే కనుక భారత రాజ్యాంగంలో ఎన్నో కనిపిస్తాయి.

ఇక్కడ అన్నీ కీలక వ్యవస్థలే. ఎవరు తక్కువ ఎక్కువ అన్నది కాదు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ మూడూ కలసికట్టుగానే పనిచేయాలి. అయితే న్యాయ వ్యవస్థకు ఉన్న మరో అధికారం ఏమిటి అంటే రాజ్యాంగ సహితంగా ఏ నిర్ణయం అయినా అమలు అవుతోందా లేదా అన్నది చూడడం. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నపుడు లేదా కీలక నిర్ణయాలు తీసుకోవలన్నపుడు రాష్ట్రపతి కార్యాలయం న్యాయ వ్యవస్థనే సంప్రదించి సలహా సూచనలు తీసుకుంటుంది.

ఇలా సాగుతున్న భారత దేశ పాలనలో ఇపుడు ఒక సరికొత్త ధర్మ సంకటం రాజ్యాంగ పరంగా ఏర్పడింది. అదేంటి అంటే రాష్ట్రపతులు గవర్నర్ల నిర్ణయాధికారాల విషయంలో ఒక పరిధిని కాల పరిమితిని విధిస్తూ న్యాయ వ్యవస్థ శాసించగలదా అన్నది. దాని మీద ఈ మధ్యనే సుప్రీంకోర్టు మూడు నెలల వ్యవధిలో తమ వద్దకు వచ్చిన ఒక ఫైల్ ని క్లియర్ చేసి పంపాలని గడువు విధించింది. అలా కనుక చేయకపోతే ఆ బిల్లుని ఆమోదించినట్లే అని కూడా పేర్కొంది.

దీని మీద అనేక రకాలైన చర్చలు చాలా జరిగాయి. ఇపుడు నేరుగా రాష్ట్రపతి సుప్రీం కోర్టుకు ఈ విషయంలో లేఖ రాయడంతో ఇది అత్యంత ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన చారిత్రక తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలు సంధించారని సమాచారంగా ఉంది. రాష్ట్రపతికి కాలపరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా అని రాష్ట్రపతి సందేహం వ్యక్తం చేశారు.

తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్‌ మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ గవర్నర్లు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 201 ప్రకారం రాష్ట్రపతికి గడువు విధించింది. రాష్ట్రపతి అనుమతి కోసం తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి 10 బిల్లులను తన వద్ద అట్టే పెట్టుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ నెల 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రశ్నావళిని పంపినట్లు వార్తలు వచ్చాయి.

తమ అనుమతి కోసం వచ్చిన బిల్లులపై చర్య తీసుకోవడానికి ఆర్టికల్‌ 143 ప్రకారం గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి నిర్దేశించి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా అని ఆమె సుప్రీంకోర్టు ప్రశ్నించారు. ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి ఇచ్చే అనుమతులు సమర్ధనీయమా అనే విషయంపై సైతం సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే దీని మీద వామపక్షాలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా విమర్శలు చేశారు. సుప్రీం కోర్టుని రాష్ట్రపతి వివరణ కోరడం అన్నది సుప్రీం తీర్పుని సవాల్ చేయడమే అవుతుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే పార్లమెంట్ లో ఏ చట్టం చేయాలి అని ఎవరూ శాసించలేరు. అలాగే చేసిన చట్టం మీద ఆమోదముద్ర వేసే విషయంలో రాష్ట్రపతి అధికారాలని కూడా ప్రశ్నించజాలరని కొందరు మేధావులు అంటున్నారు. కొన్ని చట్టాలు రాజ్యాంగ హితమైనవి కాకపోవచ్చు, జాతి ప్రయోజనాలకు ఇబ్బంది కావచ్చు అలాంటి వాటిని విచక్షణతో నిలుపు చేయాల్సిన అవసరం ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు అయితే నిర్ణీత కాల పరిమితి లేకపోతే కొన్ని చట్టాల ద్వారా జనాలకు ప్రయోజనాలు వేగంగా అందే అవకాశాలు తగ్గిపోతాయని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి దీని మీద తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో.