Begin typing your search above and press return to search.

కొత్త లా పాయింట్ : రాష్ట్రపతిని శాసించవచ్చా ?

భారత రాష్ట్రపతిని రాజ్యాంగ పరిరక్షకుడు అని పిలుస్తారు. రాష్ట్రపతిని నడిచే రాజ్యాంగం అని కూడా అంటారు.

By:  Tupaki Desk   |   20 April 2025 5:23 PM IST
కొత్త లా పాయింట్ : రాష్ట్రపతిని శాసించవచ్చా ?
X

భారత రాష్ట్రపతిని రాజ్యాంగ పరిరక్షకుడు అని పిలుస్తారు. రాష్ట్రపతిని నడిచే రాజ్యాంగం అని కూడా అంటారు. రాజ్యాంగం ప్రకారం పాలన అంతా రాష్ట్రపతి చేతుల మీదనే సాగుతుంది. రాష్ట్రపతి సంతకం లేకుండా ఏ బిల్లు కూడా చట్టం కాదు. రాష్ట్రపతి పేరు మీదనే దేశంలో పాలన అంతా సాగుతుంది అన్నది అందరికీ తెలిసిందే.

రాష్ట్రపతి ప్రధానమంత్రిని మంత్రిమండలిని నియమించి వారి చేత ప్రమాణం చేయిస్తారు. అదే విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా నియమించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే సమయంలో రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు.

ఇదిలా ఉంటే మన రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ, శాసన వ్యవస్థలకు సమాన అధికారాలను ఇచ్చింది. అయితే రాజ్యాంగం సక్రమంగా అమలు అవుతోందా లేదా అన్నది సమీక్షించే విశేష అధికారం మాత్రం న్యాయ వ్యవస్థకు ఇచ్చింది. ఆ విధంగా చూస్తే కనుక కొంచెం ఎక్కువ అధికారాలు న్యాయ వ్యవస్థకు దాఖలు అయినట్లుగా కనిపిస్తుంది.

కానీ అన్ని వ్యవస్థలు ఒక దానిని ఒకటి గౌరవిస్తూ కలసి మెలసి పనిచేయాలన్న అంతర్లీనమైన సందేశం మన రాజ్యాంగంలో ఉండడమే అందమైన విధానంగా ఉంది. అయితే ఇపుడు చూస్తే కొన్ని కీలక వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేలా కనిపిస్తోంది. మా అధికారాల్లోకి ప్రవేశిస్తున్నారు అని ఆయా వ్యవస్థలు అభిప్రాయపడుతున్నాయి.

మరీ ముఖ్యంగా శాసన కార్యనిర్వహణ వ్యవస్థలు ఎక్కువగా న్యాయ సమీక్షకు తన నిర్ణయాలు గురి అయిన సందర్భాలలో ఈ చర్చ వస్తోంది. అయితే న్యాయ వ్వవస్థ చూసేది ఏ అంశం అయినా రాజ్యాంగ బద్ధంగా ఉందా లేదా అన్నది. అలా లేని నాడు దానిని తప్పకుండా సమీక్షిస్తుంది. తన నిర్ణయాన్ని అలా తీర్పు రూపంలో ప్రకటిస్తుంది.

ఇక రాష్ట్రపతిని రాజ్యాంగ రక్షకుడిగా చెబుతారు కదా ఆయనను న్యాయ వ్యవస్థ శాసించవచ్చా అన్న కొత్త చర్చ ఇపుడు జరుగుతోంది. ఈ కొత్త లా పాయింట్ ని బయటపెట్టింది ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఆయన రాష్ట్రపతి ద్వారా నియమించబడే న్యాయ మూర్తులు అదే రాష్ట్రపతిని శాసించవచ్చా అని ప్రశ్నించారు. అదే విధంగా మరో బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే అయితే సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యవహరిస్తూ పోతుంటే ఇక పార్లమెంట్‌ను మూసివేయడం మంచిదంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే పార్లమెంట్‌ను మూసివేయాలి అని ఎక్స్‌ వేదికగా దూబే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇపుడు దీని మీదనే చర్చ మొదలైంది. ఇక ఇటీవల దాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసిన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఈ అంశం మీద మాట్లాడుతూ పార్లమెంట్‌ లేదా రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులకు ఉన్నపుడు అధికారిక విధుల నిర్వహణకు సంబంధించి రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లకు ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ అయితే ఇదే అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పడం లక్ష్మణ రేఖను దాటినట్లు కాదని తన కచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పారు.

అంతే కాదు ఆయన మరో మాట అన్నారు. న్యాయస్థానాల అభిప్రాయాలతో పార్లమెంట్‌ ఏకీభవించకపోతే నిబంధనలను సవరించే సర్వోన్నత అధికారం పార్లమెంట్‌కు ఉందని పునరుద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పరస్పరం ఢీ కొంటున్నాయనే వాదనను ఆయన ఈ సందర్భంగా కొట్టిపారేశారు.

ఇక ఇదే అంశం మీద మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ అయితే మన రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించిన అధికారాలు పరిమితమేనని గుర్తు చేశారు. అందువల్ల బిల్లులను ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి విధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టాల్సింది ఏదీ లేదని అన్నారు. సుప్రీంకోర్టు 142 అధికరణను ఆవాహన చేసుకుని తీర్పు చెప్పడం సరైనదేనని అన్నారు.

మొత్తం మీద అయితే తాజాగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్ల వద్ద పెండింగులో ప్రభుత్వ బిల్లులు ఉండే దానికి సంబంధించి కాలపరిమితి విధిస్తూ ఇచ్చిన ఆదేశాల మీద విస్తృత స్థాయి చర్చ సాగుతోంది. ముందే చెప్పినట్లుగా ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ గొప్పదే. అంతిమంగా అన్ని వ్యవస్థలూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఈ విషయంలో ఘర్షణల కంటే కూడా సామరస్య వైఖరి ముఖ్యమని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు.