కన్నీరుపెట్టిస్తున్న ప్రేమానంద్ మహారాజ్ వ్యాఖ్యలు.. అసలు ఆయనకు ఏమైంది? ఎందుకంత క్రేజ్?
అనారోగ్యంతో తన పాదయాత్ర నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సంత్, ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహరాజ్ ప్రకటించారు.
By: Tupaki Political Desk | 25 May 2026 8:00 PM ISTఅనారోగ్యంతో తన పాదయాత్ర నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సంత్, ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహరాజ్ ప్రకటించారు. యూపీలోని మధురలో ఉంటున్న ఆయన భక్తులను ఉద్దేశించి చేసిన ప్రకటన కన్నీరు పెట్టిస్తోందని అంటున్నారు. అనారోగ్యంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నానని చెప్పడంతోపాటు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఆయన చెప్పిన మాటలతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
రాత్రి వేళల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆయన చేస్తున్న పాదయాత్ర ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పాదయాత్ర ఇక కొనసాగించలేనేమోనన్న విధంగా మాట్లాడటం విస్తృత చర్చకు దారితీసిందని అంటున్నారు. ‘నేను మిమ్మల్ని కలిసినా కలవకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, వచ్చినా రాకపోయినా ఎప్పుడూ మీ హృదయాలలోనే ఉంటాను’ అని ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు భక్తుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. మహారాజ్ ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.
ఎవరీ ప్రేమానంద్ మహారాజ్
ప్రేమానంద్ మహారాజ్ అసలు పేరు అనిరుద్ధ్ కుమార్ పాండే. ఆయన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులైన ఆయన, భౌతిక సుఖాలను వదిలేసి సన్యాసం స్వీకరించారు. వారణాసిలో చాన్నాళ్లు గడిపిన తర్వాత, ఆయన బృందావనానికి చేరుకుని రాధారాణి (రాధాకృష్ణులు) భక్తి మార్గంలో లీనమైపోయారు. ప్రస్తుతం ఆయన బృందావనంలోని 'శ్రీ రాధా కేలీ కుంజ్' ఆశ్రమం ద్వారా భక్తులకు జ్ఞానబోధ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో విశేష ఆదరణ
ప్రేమానంద్ మహారాజ్ ప్రవచనాలకు, ఆయన జీవన శైలికి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ ఉంది. ఆయనకు ఇంతటి ప్రాధాన్యత దక్కడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏ విధమైన ఆడంబరాలు లేకుండా, అత్యంత సామాన్యుడిలా జీవిస్తూ, క్లిష్టమైన జీవిత సత్యాలను కూడా ఎంతో సులభంగా, సూటిగా వివరించడం ఆయన ప్రత్యేకతగా చెబుతున్నారు. కోపం, అహంకారం, మానసిక ఒత్తిడిని ఎలా జయించాలనే అంశాలపై ప్రేమానంద్ మహారాజ్ చెప్పే మాటలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో ఆయన చిన్న చిన్న బోధనలు, సందేహ నివృత్తి వీడియోలు కోట్ల సంఖ్యలో వ్యూస్ సాధిస్తూ వైరల్ అవుతున్నాయి.
కిడ్నీ సమస్యలతో సతమతం
ఇక ప్రేమానంద్ మహారాజ్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పాడైపోయాయి. వారానికి కొన్ని సార్లు ఆయనకు డయాలసిస్ జరుగుతుంది. అంతటి తీవ్ర అనారోగ్యంలోనూ, నొప్పులను భరిస్తూ ఆయన రోజూ తెల్లవారుజామునే లేచి భక్తులకు దర్శనమివ్వడం, ప్రవచనాలు చెప్పడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన సంకల్ప బలమే ఆయనను ఒక సూపర్ హ్యూమన్ గా భక్తుల గుండెల్లో నిలిపింది.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల సందర్శనతో మారిన గ్రాఫ్!
ప్రేమానంద్ మహారాజ్ ప్రాధాన్యత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మరింత పెరగడానికి సెలబ్రిటీల సందర్శన కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇటీవలే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. మహారాజ్ కాళ్లపై పడి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో కోహ్లీ దంపతులకు మహారాజ్ చేసిన హితబోధకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేశాయి. ప్రముఖ గాయకుడు బి.ప్రాక్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ఎందరో ప్రముఖులు ఆయనను దర్శించుకుని ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందారని ప్రచారం జరుగుతోంది.
