Begin typing your search above and press return to search.

ఐపీఎల్ టీంలో తీవ్ర వివాదం.. యాజమాన్య హక్కుల కోసం లొల్లి

ప్రీతి జింటా, మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా ముగ్గురూ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   23 May 2025 1:13 PM IST
ఐపీఎల్ టీంలో తీవ్ర వివాదం.. యాజమాన్య హక్కుల కోసం లొల్లి
X

పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు సమావేశం నిర్వహించారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రీతి జింటా, మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా ముగ్గురూ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎల్ (IPL) లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఈ కంపెనీనే యజమాని. గత నెల 21న జరిగిన సర్వసభ్య సమావేశం (EGM) చట్టబద్ధతను ప్రీతి జింటా కోర్టులో సవాలు చేశారు. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆమె ఆరోపించారు. ఈ భేటీకి సంబంధించి తాను ఏప్రిల్ 10న ఈమెయిల్ ద్వారా అభ్యంతరాలను తెలియజేసినప్పటికీ వాటిని పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బుర్మాన్ ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆమె ఆరోపణ.

ఈ సమావేశానికి తాను, మరో డైరెక్టర్ కరణ్ పాల్ హాజరైనప్పటికీ, ఈ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలని ప్రీతి జింటా కోర్టును కోరారు. ఈ సమావేశంలో మునీష్ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించడాన్ని ప్రీతి జింటా, పాల్ వ్యతిరేకించారు. డైరెక్టర్‌గా ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని, ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కంపెనీ అమలుచేయకుండా చూడాలని ఆమె తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ కేసు పరిష్కారం అయ్యేవరకూ తాను, కరణ్ పాల్ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా చూడాలని కూడా ప్రీతి జింటా కోర్టును అభ్యర్థించారు.

బోర్డులో వివాదాలు నెలకొన్నప్పటికీ, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు హాజరై స్టేడియంలో జట్టుకు మద్దతుగా నిలవడం గమనార్హం. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ కనిపించారు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోంది. 11 ఏళ్ల తర్వాత ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం టాప్ 2లో స్థానం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.