Begin typing your search above and press return to search.

ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్... హెచ్ఆర్సీ ఎంట్రీ?

కాగా... ప్రవళిక ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించడం లేదు! ప్రవళిక మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగడం,

By:  Tupaki Desk   |   20 Oct 2023 12:30 PM GMT
ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్  ట్విస్ట్... హెచ్ఆర్సీ ఎంట్రీ?
X

గ్రూప్స్‌ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో.. నిందితుడు శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది! అక్టోబర్ 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడటానికి శివరామే కారణం అని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే!

ఈ నేపథ్యంలో శివరాంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శివరాం పరారీలో ఉన్నాడని, పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారని తెలిపారు! ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారని అంటున్నారు. అవును... ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమని చెబుతున్న శివరాం రాథోడ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో... శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే... శివరాం అరెస్టును పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ గురువారం అరెస్ట్ వాస్తవమే అయితే... శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది!

ఈ సమయలో శివరాం కుటుంబ సభ్యులు ఎంటరయ్యారు. ఇందులో భాగంగా మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో... శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌ కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్‌ కౌంటర్‌ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు!

ఈ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిందిపోయి.. తమను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు. ఇదే సమయంలో... అతడి గురించి ఏ విషయం తెలిసినా వెంటనే పోలీసులు చెబుతామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని హెచ్‌ఆర్‌సీ ని శివరాం బంధువు వేడుకున్నారు.

కాగా... ప్రవళిక ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించడం లేదు! ప్రవళిక మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగడం, టీఎస్పీఎస్సీ గ్రూప్ - 2 పరీక్షల వాయిదాల వల్లే మానసిక ఒత్తిడితో చనిపోయిందని సహచరులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగడంతో.. ఈ విషయం రాజకీయరంగు పులుముకున్న సంగతి తెలిసిందే. అనంతరం... పోలీసులు శివరాంని తెరపైకి తెచ్చారు!!