Begin typing your search above and press return to search.

ప్రవళిక కేసులో శివరాంపై కేసు నమోదు... తెరపైకి ఎన్ కౌంటర్ రిక్వస్ట్!

ఈ నేపథ్యంలో... ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాంను నిందితుడిగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. ఇందులో భాగంగా శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 5:09 PM GMT
ప్రవళిక కేసులో శివరాంపై కేసు నమోదు... తెరపైకి ఎన్  కౌంటర్  రిక్వస్ట్!
X

సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో తాజాగా కీలక అప్ డేట్స్ తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... ప్రవళిక ఆత్మహత్య ఘటనలో చిక్కడపల్లి పోలీసులు శివరాంను నిందితుడిగా చేర్చారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శివరాం.. మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్ని డిలీట్ అయిన వాట్సప్ చాట్ లు రిట్రీవ్ చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె రుంలో ఒక ప్రేమలేఖ దొరికిందని చెప్పారనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాంను నిందితుడిగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. ఇందులో భాగంగా శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని.. అతడి ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

మరోపక్క ఓ యువకుడి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ప్రవళిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి విజయమ్మ తెలిపారు. రెండు సంవత్సరాలుగా తన బిడ్డను హైదరాబాద్ లో చదివించుకుంటున్నట్లు తెలిపిన ఆమె తల్లి విజయమ్మ... తమలాంటి కష్టాలు తమ పిల్లలు పడకూడదని కష్టపడి చదివించుకుంటున్నామని అన్నారు. అయితే తన కళ్లల్లో మన్నుపోసుకున్న అతడు ఆమెను టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ భరించలేక, ఆ బాధ తమకు చెప్పుకోలేక, చనిపోవడమే మేలని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

ఇలా తనబిడ్డను చంపినవాడిని శిక్షించాలని, తనబిడ్డకు కలిగిన బాధ మరోబిడ్డకు కలగకూడదని ఆమె కోరారు. ఇదే సమయంలో పార్టీల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి వారూ వారూ చూసుకోవాలి కానీ... రాజకీయాల్లోకి తమను లాగొద్దని, ఆ స్టేట్ మెంట్ ఇవ్వండి, ఈ స్టేంట్ మెంట్ ఇవ్వండని కోరొద్దని ఆమె రాజకీయపార్టీలను రిక్వస్ట్ చేశారు.

ఇదే సమయంలో... శివరాం అనే యువకుడు తమ సోదరిని తరచూ వేధించేవాడని ప్రవళిక సోదరుడు మర్రి ప్రణయ్ తెలిపారు. చదువుకునే సమయంలోనే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడని.. కాల్ లిఫ్ట్ చేయకపోతే తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసేవాడని తెలిపాడు. ఇందులో భాగంగానే శివారం వేధింపులు తట్టుకోలేక తమ సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రణయ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా... శివరాంను ఎన్ కౌంటర్ చేయడమా, ఉరి తీయడమా ఏదో ఒకటి చేసి తమ అక్కకు న్యాయం చేయాలని కోరాడు.

కాగా... ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్‌ నగర్‌ లోని ఓ వసతిగృహంలో ఉంటూ ప్రవళిక శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... ఈనెల 13న హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్‌-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని భారీ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా... ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయని తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శివరాం అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, ఆ బాద తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తెలిపారు! ఈ క్రమంలోనే తాజాగా శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.